
యూరియా కోసం రైతుల పాట్లు
పాల్వంచరూరల్: యూరియా కోసం నిత్యం అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదిక వద్ద మూడు రోజుల క్రితం రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పి ఆధార్‌కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్‌లు తీసుకున్నారు. కానీ, బుధవారం వాటిని తిరిగి రైతులకు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీ చేస్తారని ఆశతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతువేదిక వద్ద 150 మందికి పైగా పలు గ్రామాలకు చెందిన రైతులు నిరీక్షించారు. కానీ, అధికారులు యూరియా పంపిణీ చేయకుండా తీసుకున్న జిరాక్స్ పత్రాలు ఇచ్చారు. కాగా, యూరియా కోసం వచ్చిన రైతులకు బీఆర్‌ఎస్ నాయకులు కాంపెల్లి కనకేశ్ భోజనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంజిత్, హర్షవర్దన్, ప్రసాద్, శోభన్, పుల్లయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.