
పంట నిల్వ ప్రాజెక్టులకు రాయితీలు
ఖమ్మంవ్యవసాయం: పంటల నిల్వ, రవాణా, ప్రాససింగ్ చేయడం వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఉద్యాన రైతులకు ఈ మేరకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. దేశంలో రైతులు పండించిన పంటల్లో 20–30 శాతం వరకు తగిన నిర్వహణ లేక నాణ్యత కోల్పోయి మద్దతు ధర దక్కడం లేదు. ఉద్యాన పంటల్లో ప్రధానంగా పండ్లు కోత తరువాత శీతలీకరించడం, గ్రేడ్ చేయడం, ప్యాకింగ్, రవాణా, ప్రాసెసింగ్ వంటి విధానాలు అవలంభించడం ద్వారా విలువ పెరగడంతో పాటు ప్రత్యేక మార్కెటింగ్ చానల్ ద్వారా అమ్మకాల కు అవకాశం ఉంటుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాక వినియోగదారులకు నాణ్యమైన పండ్లు లభిస్తాయి. జిల్లాలో పండ్లతోటలు పెంచే రైతుల కు ఏడు ప్యాక్ హౌస్ యూనిట్లు, రెండు కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ఒక రైషనింగ్ చాంబర్, 15సోలార్ ప్యానెల్ యూనిట్లు మంజూరయ్యాయని జిల్లా ఉద్యానాధికారి ఎం.మధుసూదన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.