
ఏపీ పోలీసుల దౌర్జన్యం
● స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబాటు ● కోడిపుంజుల నెపంతో మహిళపట్ల దురుసు ప్రవర్తన ● సీసీ కెమెరాల ధ్వంసం, హార్డ్ డిస్క్‌ల స్వాధీనం ● ఆంధ్రా పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న దమ్మపేట గ్రామస్తులు
దమ్మపేట : దమ్మపేట గ్రామంలోని కాపుల బజార్‌లో సోమవారం ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఏపీ పోలీసులు, మహిళపై దురుసుగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలను పగులకొట్టారు. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు పందెం కోడి పుంజులను దమ్మపేటకు చెందిన వ్యక్తి దొంగిలించాడనే నెపంతో వచ్చారు. చింతలపూడి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు, రంగనాథ్‌తోపాటు మరో 20 మంది వ్యక్తులు నాలుగు కార్లలో దమ్మపేటలోని కాపుల బజారుకు వచ్చారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా, అనుమతి తీసుకోకుండా గోపవరపు శేషు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటికి ఉన్న రెండు గేట్లను మూసేసి, ఇంటి ముందు ఉన్న రెండు సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శేషు భార్య రాజేశ్వరి ప్రశ్నించగా... నీ భర్త కోడిపుంజుల దొంగతనాలతోనే ఇంత సంపాదించాడా అంటూ పోలీసులు ఆమె పట్ల దురుసుగా మాట్లాడారు. బలవంతంగా బీరువా తెరిపించి శేషు ఆధార్ కార్డు తీసుకున్నారు. వారు పెంచుకుంటున్న కోడి పుంజులను పోలీసులతో వచ్చిన వ్యక్తులు స్వాధీనం చేసుకుని, ఆమెను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో ఆ వీధిలో నివాసం ఉంటున్న గ్రామస్తుల వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఏపీ పోలీసులను, వారితో వచ్చిన వ్యక్తులను, వాహనాలను అడ్డుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళపై దౌర్జన్యం ఏమిటని నిలదీశారు. పోలీసులను, వారి కారును కదలన్వికుండా దాదాపు నాలుగు గంటలపాటు ముట్టడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఏపీ పోలీసుల వాహనాన్ని దమ్మపేట స్టేషన్‌కు తరలించారు. బాధిత మహిళ రాజేశ్వరి చింతలపూడి పోలీసుల దౌర్జన్యంపై దమ్మపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు.