
లభ్యంకాని మరో మహిళ ఆచూకీ
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కూలీలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ఇంకా ఓ మహిళా కూలీ ఆచూకీ తెలియరాలేదు. సోమవారం కూడా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు పరిసరాలతోపాటు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగాయి. గత శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో అశ్వారావుపేట మండలంలోని గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగును దాటే క్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు కూలీల్లో ఇద్దరు కూలీలు పాలడుగుల చెన్నమ్మ(60), పచ్చిసాల వరలక్ష్మి(55) గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా, వీరిలో చెన్నమ్మ మృతదేహాన్ని అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామ శివారులోని చెక్ డ్యాం వద్ద పోలీసులు గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. మరో మహిళ వరలక్ష్మి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. దీంతో స్థానిక అధికారులతోపాటు ఏపీ అధికారులు, ఎన్డీఆర్‌ఎస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. వాగు దట్టమైన ప్రాంతం గుండా ప్రవహించడంతో మార్గమధ్యలోని అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు సాధ్యం కావడంలేదు. దీంతో ఏపీ పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. మండలంలోని అనంతారం, నెమలిపేట, నారాయణపురం, బచ్చువారిగూడెం మీదుగా పెదవాగు వరదనీటి ప్రవాహంలో బోటు సాయంతో సిబ్బంది గాలింపు కొసాగిస్తుండగా, స్థానిక తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, ఎస్సై రామ్మూర్తి పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులైనా వరలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.
మూడు రోజులుగా కొనసాగుతున్న
గాలింపు చర్యలు