స్థానిక పోరుకు సన్నద్ధం ! | - | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుకు సన్నద్ధం !

Aug 3 2025 3:40 AM | Updated on Aug 3 2025 3:40 AM

స్థానిక పోరుకు సన్నద్ధం !

స్థానిక పోరుకు సన్నద్ధం !

● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ ● గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం ● జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

బూర్గంపాడు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేయగా అవసరమైన సామగ్రిని మండల కేంద్రాలకు చేరవేస్తున్నారు. తొలుత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ప్రభుత్వ సూచనల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. అయితే పరిషత్‌ స్థానాల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. రాజకీయ పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది.

22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు..

జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించలేదు. భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసే యోచనతో గత ప్రభుత్వం ఈ రెండు గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ స్థానాలను రద్దు చేసింది. అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులతో ఈ రెండు జీపీలను యథావిధిగా కొనసాగించాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బూర్గంపాడు మండలం సారపాక, భద్రాచలం మండలంలో కూడా ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయగా.. అశ్వారావుపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంతో అక్కడ ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. అలాగే సుజాతనగర్‌ను కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం చేస్తుండగా అక్కడా ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. దీంతో గతంలో 236 ఎంపీటీసీ స్థానాలుండగా ఈసారి ఆ సంఖ్య 233కు తగ్గింది.

రిజర్వేషన్లు మారేనా..?

జిల్లాలో కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు తగ్గడం, కొన్ని చోట్ల పెరగడంతో రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు పదేళ్ల పాటు(రెండు విడతలు) మారకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంపీటీసీ స్థానాల్లో హెచ్చుతగ్గుల కారణంగా రిజర్వేషన్లు మారుతాయనే చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనే అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఏ స్థానం ఎవరికి రిజర్వ్‌ ఆవుతుందనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. ముఖ్యంగా జనరల్‌ స్థానాల కోసం కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో జనరల్‌ స్థానాల్లో గెలుపొందిన, ఓడిపోయిన అభ్యర్థులు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు గత రిజర్వేషన్లే యథావిధిగా కొనసాగేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామస్థాయిలో ప్రచారం సాగిస్తుండగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచి జిల్లాలో తమ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌, కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే ఉండడంతో స్థానిక ఎన్నికల్లోనూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ కూడా జిల్లాలో మెజారిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీల్లోనూ పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో సొంత పార్టీలోనే వర్గ విభేదాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ, వామపక్షాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement