
ప్రామాణిక గ్రంథంగా ‘ఇలవేల్పుల చరిత్ర’
భద్రాచలం: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా రూపొందిస్తున్న ఇలవేల్పుల గ్రంథం ప్రామాణికంగా మారుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల చరిత్ర, కట్టుబాట్లు, పూజా విధానాలు ప్రస్తుత, భవిష్యత్ తరాలకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఐదు గోత్రాలు, ఇలవేల్పులకు సంబంధించిన తలపతులను, ఆర్తి బిడ్డలను బృందాలుగా చేసినట్లు తెలిపారు. వీరి ద్వారా మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఇలవేల్పుల చరిత్ర సేకరిస్తామని, ఒక్కో ఆదివాసీ తెగలకు సంబంధించిన సమాచారాన్ని క్రోఢీకరించడం పూర్తయిందని తెలిపారు. ఆ తర్వాత అభిప్రాయ సేకరణ ఉంటుందని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇలవేల్పుల గ్రంథం రూపకల్పన, విడుదల ఉంటాయని వివరించారు. ఈ చరిత్ర వెయ్యి సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఏసీఎంఓ రమేష్, రిటైర్డ్ ఏసీఎంఓ రమణయ్య, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి, తలపతులు, ఆర్తి బిడ్డల సంఘం నాయకులు జగపతిరావు, కోటేశ్వరరావు, చలపతిరావు, పోషాలు, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల తలపతులు, ఆర్తి బిడ్డలు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్