రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Aug 3 2025 3:40 AM | Updated on Aug 3 2025 3:40 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

విచారణ వేగవంతం చేయాలి

జిల్లా జడ్జి పాటిల్‌ వసంత్‌

కొత్తగూడెంటౌన్‌: జైలులో ఉన్న ముద్దాయిల కేసులను త్వరగా విచారణ చేపట్టి అంతిమ తీర్పునకు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ అన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారెంట్‌ పెండింగ్‌ కేసుల్లో సాక్షులను తీసుకురావాలని, కొత్తగా నమోదైన కేసుల్లో వెంటనే చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలని సూచించారు. పెండింగ్‌ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌, పీపీలు, ఏపీపీలు పాల్గొన్నారు.

కేంద్ర బృందం పర్యటన

ఇల్లెందురూరల్‌: మండలంలోని రాఘబోయినగూడెం, పూబెల్లి, రేపల్లెవాడ గ్రామాల్లో కేంద్ర బృందం ప్రతినిధులు శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. డంప్‌షెడ్డు, ఇంకుడు గుంతలు, పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. పలు వీధుల్లో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతోందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో మరుగుదొడ్లు, వాటి నిర్వహణపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమావేశమై కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు కె.జయంత్‌, ఎస్‌.రవిచంద్ర, ఎస్‌బీఎం జిల్లా కో – ఆర్డినేటర్‌ రేవతి, ఎంపీఓ చిరంజీవి, ఏపీఓ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తంగా ఉండాలి

టేకులపల్లి : సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ స్పందన అన్నారు. మండలంలోని సులానగర్‌ పీహెచ్‌సీని శనివారం ఆమె తనిఖీ చేశారు. ల్యాబ్‌లో చేస్తున్న రక్త పరీక్షలను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జ్వరం లక్షణాలు ఉన్న వారికి డెంగీ, మలేరియా నిర్ధారణకు త్వరగా ఫలితం వెల్లడయ్యే ఆర్డీటీ పరీక్షలు నిర్వహించాలని, ఎలీసా పరీక్ష కోసం రక్త నమూనాలను తెలంగాణ హబ్‌ కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల విషయంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు దృష్టి పెట్టాలని, దోమకాటుతో వచ్చే వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా అవసరమైన రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి శుక్ర, మంగళవారాల్లో విధిగా డ్రైడే నిర్వహించాలని, జ్వర పీడితుల గుర్తింపునకు ప్రతీ నెల 7 నుంచి 17 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి కంచర్ల వెంకటేష్‌, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, స్టాఫ్‌ నర్స్‌ జగదాంబ, సూపర్‌వైజర్‌ నాగుబండి వెంకటేశ్వర్లు, కౌసల్యసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/2

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన2
2/2

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement