
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాలి
సింగరేణి(కొత్తగూడెం): ఆపరేషన్ సింధూర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ అంటున్నారని, రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం తగదని మోదీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగినా ప్రధాని నోరు మెదపడం లేదని ఆరోపించారు. మైనార్టీలపై కక్ష సాధించేందుకే బిహార్‌లో ఓటర్ల రివిజన్ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చారని, ముస్లింల ఓట్లు తగ్గించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇవ్వడం సరైంది కాదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అన్నారు. పోలవరం నిర్మిస్తే భద్రాచలం మునక తప్పదని, దీన్ని అడ్డుకోవాలని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, అన్నవరపు కనకయ్య, యలమంచి రవికుమార్, ఎం.జ్యోతి, అన్నవరపు సత్యనారాయణ, పుల్లయ్య, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని