
తేనెటీగల పెంపకంతో లాభాలెన్నో..
కలెక్టర్ జితేష్ వి పాటిల్, సీఎండీ బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): తేనెటీగల పెంపకంతో లాభాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ అన్నారు. కొత్తగూడెం ఏరియాలో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చిన 100 మంది మహిళలకు మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తేనెటీగల పెంపకంపై మహిళలకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. తేనెటీగలతో పాటు మునగ, వేప, కూరగాయల వంటివి కూడా సాగు చేయాలని సూచించారు. సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కంపెనీ అందించిన తేనె తొట్టెల కిట్లనతో పెద్ద ఎత్తున తేనె ఉత్పత్తి చేయాలని, మార్కెట్‌లో తేనెకు గల డిమాండ్‌తో లాభాలు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్(పా)గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం. శాలేంరాజు, రమణమూర్తి, పీతాంబరరావు తదితరులు పాల్గొన్నారు.
చేతి వృత్తులకు భవిష్యత్‌లో విలువ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా యువత చేతి వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. చేతి వృత్తులతో స్థిరత్వం, ఆదాయం ఉంటాయని, శిక్షణ పూర్తయ్యాక నెలకు రూ.15 వేల నుంచి రూ. 30 వేలకు వరకు పారితోషికం ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్కిల్ అకాడమీ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ చారి, మెప్మా పీడీ రాజేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు రామడుగు రామాచారి తదతరులు పాల్గొన్నారు.