పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న వరదల్లో అక్కడి కాలమానం ప్రకారం శనివారం ఉదయం గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్‌కు వెళ్లిన వెంకటేష్ అక్కడ వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి భారీ కొట్టుకొనిపోయాడు. విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఉన్నతాధికారులను సంప్రదించగా వారు అతని ఆచూకీ కోసం వెదికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.


