తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై వేంకటేశ్వర స్వామికి జ్యేష్ఠాభిషేకాన్ని ఆదివారం నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి పరిపూర్ణ మంగళ శాసనాలతో త్రిదండి అహోబిల జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామికి 81 కలశాలతో జ్యేష్ఠాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు.
గుంటూరు రూరల్: ఏరువాక పౌర్ణమి ఒక వేడుక మాత్రమే కాదని.. ప్రకృతికి, మానవాళికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధానికి ప్రతీకని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం గుంటూరు నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సూచికగా రైతులు సంప్రదాయబద్ధంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.రామచంద్రరావు, కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ జి.జోగినాయుడు, కంప్ట్రోలర్ డాక్టర్ బి.ముకుందరావు ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 11వ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 200 మందికిపైగా క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ప్రతినెలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయన్నారు. క్రీడలను ప్రోత్సహించి యువ క్రీడాకారులను తయారుచేసే కార్ఖానాగా స్టేడియం అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్, జైన్, ఎం.లక్ష్మణరావు, పి. వెంకట్రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు గుడివాడ డీఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం జరగనుంది. ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు దేవస్థాన ప్రచార రథంపై కొలువై ఉన్న మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు.


