భద్రతకు లైసెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

భద్రతకు లైసెన్స్‌

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

పట్నంబజారు: గుంటూరు నగరంలో మైనర్ల డ్రైవింగ్‌ రోజు రోజుకు పెరిగిపోతోంది. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో లక్షలాది రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని కొనిపెడుతున్నారు. అయితే ఎంతో అవసరమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌పై దృష్టి సారించటం లేదు. ఇటీవల కాలంలో డిగ్రీ విద్యార్థినికి తల్లిదండ్రులు ఖరీదైన వాహనాన్ని కొనిపెట్టారు. ఆ విద్యార్థి అనుకోకుండా ఒకరిని ఢీ కొట్టడం... వారికి తీవ్ర గాయాలు కావటంతో.. విద్యార్థితో పాటు లైసెన్స్‌ లేని కారణంగా తల్లిదండ్రులపైన కేసు నమోదైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్త అవసరం అనే విషయాన్ని గుర్తించాలి.

లైసెన్స్‌ లేకుంటే..

వయసు పరిమితి దాటి కూడా లైసెన్స్‌ పొందలేదంటే.. అది కచ్చితంగా మన తప్పే. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా రోడ్డుపైకి వస్తే.. అనుకొని ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగిన వారి కంటే మననే ఎక్కువ నష్టం భరించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష ఉత్తీర్ణత కావడం... ఆపై అధికారుల ముందు వాహనాన్ని నడపటం కష్టం... సమయం వచ్చినప్పుడు చూద్దాం... అనుకునే వాహన చోదకులు ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ తీసుకోవాలి. వాహనదారుడి భద్రతకు ఇది ఎంతో మేలు చేస్తుంది. చిన్నారుల మీద ప్రేమతో వాహనాలు ఇప్పించటంతో పాటు వారి భధ్రతకు కావాల్సిన శిక్షణతో పాటు లైసెన్స్‌లు తప్పని సరిగా ఇప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

స్లాట్‌ బుకింగ్‌ కోసం..

గుంటూరు జిల్లాలోని డెప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి నిత్యం సగటున 200పైగా ఎల్‌ఎల్‌ఆర్‌, లైసెన్స్‌ నిమిత్తం వస్తున్నారు. ఆయా ప్రాంతా నుంచి స్లాట్‌లు బుక్‌ చేసుకుని, నిత్యం వందలాది మంది లైసెన్స్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. స్లాట్‌ల ప్రకారం.. ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాలు అనేక మండలాలు గుంటూరు ప్రాంతీయ రవాణా కార్యాలయ పరిధిలోకి వస్తాయి. 2022 లో 30,384, 2023లో 21, 840, 2024లో 18,572, 2025లో 20,303, ఏ ఏడాది ఇప్పటీ వరకు సుమారుగా ఐదువేల మంది వరకు లైసెన్సులు పొందారు.

సేవలు సులభతరం

వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఎల్‌ఎల్‌ఆర్‌ అనుమతి పత్రాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం రవాణా సేవలను సులభతరం చేసింది. ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్నవారు. ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. స్లాట్‌ ప్రకారం పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత అధికారుల ముందు వాహనాలు నడిపి అనుమతులు పొంద వచ్చు. ప్రస్తుతం పరివాహన్‌ యాప్‌ ద్వారా మనకు ఇష్టం వచ్చిన రోజు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

అరకొర డ్రైవింగ్‌తో రోడ్డెక్కేస్తున్నారు!

ప్రతి కుటుంబానికి సరాసరి రెండు లేదా మూడు వాహనాలు కనిపిస్తున్నాయి. ఇంట్లోని పెద్దా చిన్న తేడా లేకుండా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ డ్రైవింగ్‌ లైసెన్‌న్స్‌ తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మానవుల జీవితానికి తక్షణ అవసరంగా మారిన వాహనాలను నడపటానికి ముందు రహదారి నిబంధనలు తెలుసుకోవాలి. ఆ తర్వాత రవాణా శాఖ నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని ఆపై రోడ్డుపైకి రావాలి. ఇవేవీ పట్టించుకోకుండా అరకొర డ్రైవింగ్‌ నేర్చుకుని రోడెక్కెస్తున్నారు. ఇలాంటి వారి వలన ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసిపో తున్నాయి. వాటిలో భాగంగా గుంటూరు ట్రాఫిక్‌ పోలీసులు 2025లో మైనర్‌ల డ్రైవింగ్‌కు సంబందించి 1075 కేసులు నమోదు చేయగా రూ.15 లక్షల 50వేలు, ఈ ఏడాది 127 కేసులు నమోదు కాగా రూ.6 లక్షల 35వేలు జరిమానాలు విధించారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌తో ఎన్నో ఉపయోగాలు

ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ దరఖాస్తుకు అవకాశం

అనుమతులు లేని ప్రయాణంతో కష్టాలే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement