దాడికి గురైన వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

దాడికి గురైన వృద్ధుడు మృతి

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

హత్య కేసుగా మార్చిన పోలీసులు

తెనాలిరూరల్‌: దాడికి గురైన వృద్ధుడు మృతి చెందడంతో దాడి కేసును హత్య కేసుగా మర్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. పట్టణంలోని నందులపేట ఈటీ కాలనీకి చెందిన గాదె ఏసయ్య(63) రత్నా టాకీస్‌ సెంటరులోని రైతు బజారు నుంచి హోటళ్లకు తన బల్ల రిక్షాపై కూరగాయలు వేస్తుంటాడు. కూరగాయలు తీసుకురావడం ఆలస్యమవడంతో ఈ నెల 15న బుర్రిపాలెం రోడ్డులోని ఫుడ్‌ కోర్టు వర్కరు షేక్‌ రహీమ్‌, ఏసయ్యపై దాడి చేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రుడిని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్స కోసం గుంటూరు పంపారు. 23వ తేదీ డిశ్చార్జి చేసే సందర్భంలో ఏసయ్య గతం మర్చిపోయాడని, మందులు వాడాలని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ఇంట్లో ఉంటూ ఆదివారం మృతి చెందాడు. మే19వ తేదీన దాడి ఘటనగా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా హత్య కేసుగా మార్చారు. వన్‌ టౌన్‌ సీఐ సీహెచ్‌ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు..

తెనాలిరూరల్‌: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన తెనాలిలో ఆదివారం జరిగింది. తెనాలిలోని ఏ1–ఏ1 రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన ఫుడ్‌ కోర్టులో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా పట్టణ ముత్యంశెట్టిపాలెంకు చెందిన ఆలవాల శివ(32) విద్యుదాఘాతానికి గురయ్యాడు. హోటల్‌ నిర్వాహకులు ప్రకాశం రోడ్డులోని ప్రవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని మృతుడి ఇంటికి తీసుకెళ్లారు. టూ టౌన్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

పిడుగుపాటుకు వ్యక్తి..

దుర్గి: దుర్గిలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యరనాగుల చిన వెంకటేశ్వర్లు (55) ఆదివారం మధ్యాహ్నం మేకలు తోలుకొని పొలానికి వెళ్లాడు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, చిరుజల్లులు తోడు ఉరుములు, మెరుపులు సాగగా మేకలను తోలుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు కలరు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు రోధించటం పలువురిని కలచివేసింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గుంటూరు–పిడుగురాళ్ల హైవే రోడ్డులో ధూళిపాళ్ల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో బాపట్లకు చెందిన జాలాది సుమన్‌ (40) మృతి చెందగా, షేక్‌ డకీర్‌, షేక్‌ నజీర్‌ అహమ్మద్‌, మిన్ను సలీం తదితరులకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ధూళిపాళ్ల వద్ద కోడిగుడ్ల లోడుతో వెళుతున్న వాహనం ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

గంజాయి విక్రేతపై పీఐటీ– ఎన్‌డీపీఎస్‌ చట్టం

నగరంపాలెం: గంజాయి అక్రమ రవాణాదారుడిపై పీఐటీ– ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే తుళ్లూరు మండలం ఐనవోలుకి చెందిన 21 ఏళ్ల పసుపులేటి నరేష్‌పై పీఐటీ– ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నరేష్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నిర్బంధించేందుకు ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు చేస్తూ, తుళ్లూరు మండల పరిసరాల్లో సహచరులతో ఏకమై, మాదక ద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తోన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇప్పటికే అతనిపై విశాఖపట్నం రూరల్‌ జిల్లా గోలుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement