నరసరావుపేట ఈస్ట్: టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పుతో వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతుంటే స్పందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాధరెడ్డి విమర్శించారు. ఎస్టీయూ భవన్‌లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి అధ్యక్షతన జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రఘునాధరెడ్డి మాట్లాడుతూ అన్ని విద్యార్హతలతో నియామకం పొంది గత ఇరవై, ముప్‌పై సంవత్సరాలుగా బోధనానుభవం కలిగిన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అనటం విడ్డూరంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతుంటే చట్ట సవరణ దిశగా చర్యలు చేపట్టాల్సిన కేంద్రం, ఒత్తిడి తీసుకురావలసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించక పోవటం అన్యాయమన్నారు. చట్ట సవరణ జరిగేలోగా ప్రత్యేక టెట్ నిర్వహించటంతో పాటు, కటాఫ్ మార్కులు తగ్గించేలా చర్యలు చేపట్టి ఉపాధ్యాయులలో భయాందోళనలు తగ్గేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు హితవు పలికారు. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ విడుదలపై స్పందించక పోవటం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చని పక్షంలో మరో ఉద్యమం చేపట్టక తప్పదని స్పష్టం చేసారు. సమావేశంలో ఎస్టీయూ నేతలు కె.కోటేశ్వరరావు, కె.వి.శేఖర్, జే.గంగాధరబాబు, ఎం.వెంకటకోటయ్య, ఏ.ఏమండీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ డిమాండ్


