మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనంగా నిర్మించిన కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు న్యాయమూర్తులతో కలసి ప్రారంభించారు. తొలిరోజు నాలుగు కేసులను విచారించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సురేష్‌బాబు, జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న భూసమేత రంగనాయకస్వామి ఆలయం శనివారం భక్తులతో కళకళ లాడింది. బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజులు ముందుగా స్వామి వారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజైన శనివారం ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, రంగనాయక స్వామి మూలవిరాట్‌లకు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం చందన అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దాచేపల్లి : స్థానిక వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరుణాల శనివారం ప్రారంభమైంది. అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు, భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కొలుపులు తిరుణాల ప్రారంభ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి కొలుపులు తిరుణాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్ వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలోకి ఓ కారు దూసుకు వెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో కారు కాలువకు, డ్రైనేజీకి మధ్యలో మురుగునీటిలో కూరుకుపోయింది. కానిస్టేబుల్ ఒకరు ఉండవల్లి సెంటర్ నుంచి బైపాస్ వైపు కారులో అతివేగంగా వెళుతుండగా, భరత మాత సెంటర్ వద్ద కాంక్రీట్ దిమ్మను ఢీకొని 15 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంఽధించిన స్థాయీ సంఘ సమావేశాల అజెండాలపై చర్చించారు.


