నిబంధనలకు విరుద్ధంగా బంజరు భూమిగా చూపిన యంత్రాంగం పంచాయతీ తీర్మానాన్నీ ఖాతరు చేయని వైనం వెంటనే పనులను ఆరంభించిన సదరు కాంట్రాక్టు సంస్థ ప్రజల ఆందోళనతో తాత్కాలికంగా నిలిచిన పనులు
మహాకుంభాభిషేకం చందాలపై మరో ఫిర్యాదు...
గోవాడ(తెనాలి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అంత వైభవంగా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే ప్రసిద్ధ శైవక్షేత్రం గోవాడలోని శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానం. అక్కడ ఏటా తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంఎఎస్‌ఎంఈ పార్కు నిర్మాణానికి కట్టబెట్టటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ అభ్యంతరం చెప్పినా, ప్రజలు అభ్యర్థించినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు ఆ స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. ఆగమేఘాలపై అక్కడ నిర్మాణ పనులనూ ఆరంభించారు. ప్రజల అభ్యంతరాలు/ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా పనులను నిలుపుదల చేశారు. నిర్మాణ సామగ్రిని మాత్రం తొలగించలేదు. నిబంధనలకు విరుద్ధంగా డొంకరోడ్డును ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించటం, అధికారుల అత్యుత్సాహంపై విచారణ చేయాలని స్థానికులు శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
ఉత్సవాలకు ఎంతో కీలకం
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలో గోవాడ గ్రామం ఉంది. అక్కడి శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి విశేష చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏటా అక్కడ 15 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. అందుకోసం పలు అన్నదాన సత్రాలు వెలిశాయి. చివరి మూడురోజులు తిరునాళ్ల మరింత ప్రత్యేకమైంది. గోవాడ–కావూరు డొంకరోడ్డు వెంట జరిగే మూడు రోజుల తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల మంది వస్తారని అంచనా ఉంది. తిరునాళ్ల ఏర్పాట్లపై రేపల్లె ఆర్డీఓ అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరునాళ్లకు దాదాపు 500 దుకాణాలు ఏర్పాటు అవుతాయి. డొంకరోడ్డు సరిపోక స్టాల్స్ నిర్వాహకులు సమీప రైతుల స్థలాల్లోనూ సర్దుకుంటారు. ఏడురోజుల పశుప్రదర్శన కూడా మరో ఆకర్షణ. వివిధ ప్రాంతాల నుంచి తిరునాళ్ల స్పెషల్ బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. ఇంతటి కీలకమైన డొంకరోడ్డు గోవాడ, చెరుకుపల్లి మండల గ్రామం కావూరు మధ్య ఉంది. గోవాడ పరిధిలో సర్వే నెం.605/ఏ, 605/బీ, 606, 758/ఏ, 758/బీ, 758/సీ లోని దాదాపు 4 కి.మీ.వరకు 40–80 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డొంకరోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉన్నాయి. రోడ్డు దిగువన మంచినీటి పథకం పైప్‌లైన్ కూడా ఉందని చెబుతున్నారు. గోవాడ, కావూరే కాకుండా, పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఏడాదంతా వ్యవసాయ పనులకు ఈ డొంక రోడ్డును ఎక్కువగా వినియోగిస్తుంటారు.
అధికారుల అత్యుత్సాహం
గోవాడ డొంకరోడ్డు భూమిలో కొంత భాగాన్ని 1943లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుడికి కేటాయించింది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం రావటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే డొంక రోడ్డు ప్రాంతాన్ని పేదల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించినా తర్వాత ఆ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి, ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, మొత్తం డొంక రోడ్డు ప్రదేశాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించింది. డొంకరోడ్డును ఇతర ఏ అవసరాలకు కేటాయించరాదనే నిబంధనతో భూమి స్వభావాన్ని కూడా మార్చి బంజరు భూమిగా చూపించారని అధికారులపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గతేడాది గోవాడ పంచాయతీ ఎంఎస్‌ఎంఈ పార్కుకు అనుమతిస్తూ తీర్మానించినా, మరికొద్ది నెలల్లోనే ఆ తీర్మానాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ అమృతలూరు తహసీల్దారు పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏపీఐఐసీకి అప్పగించటం, సంబంధిత కాంట్రాక్టు సంస్థ పనులను ఆరంభించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజరు అత్యుత్సాహం చూపారని, కాంట్రాక్టు సంస్థ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా స్థానికులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జిల్లా కలెక్టరుతో మాట్లాడినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా లేదంటున్నారు.


