కొరత కృత్రిమం.. అంతా అక్రమం | - | Sakshi
Sakshi News home page

కొరత కృత్రిమం.. అంతా అక్రమం

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

గ్యాస్‌ కొరతతో పలు వ్యాపార సంస్థలు మూత బ్లాక్‌ మార్కెట్‌లో యథేచ్ఛగా సిలిండర్లు లభ్యం తనిఖీల్లో బయట పడుతున్న అక్రమార్కుల తీరు అడ్డగోలుగా తరలించి సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీలు తనిఖీల మాటున మామూళ్లు దండుకుంటున్న అధికారులు

రూ.లక్ష తీసుకొని కేసు నీరుగార్చి..

నరసరావుపేట టౌన్‌: జిల్లాలో గ్యాస్‌ కొరత పేరుతో నెలకొన్న పరిస్థితులు సాధారణ సరఫరాకు అంతరాయం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు గ్యాస్‌ కొరతతో మూతపడుతున్నాయి. మరో వైపు అదే గ్యాస్‌ అధిక ధరల్లో బ్లాక్‌లో సులభంగా లభించటం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో పెరుగుతోంది. యుద్ధ పరిస్థితులను బూచిగా చూపి కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టించాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం ఉందన్న ప్రచారంతో బహిరంగ మార్కెట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న కొంత మంది గ్యాస్‌ ఏజెన్సీ వారు దళారులతో కలిసి బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీశారు.

ప్రస్తుతం కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భారీ ధరలతో హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. కొందరు వ్యాపారాలను నెట్టుకొస్తుండుగా, మరి కొందరు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివాహాల సీజన్‌ కావటంతో క్యాటరింగ్‌ రంగానికి గ్యాస్‌ సిలిండర్‌లు అత్యవసరం. దీంతో అధిక ధరలైనా చెల్లించి సిలిండర్‌లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. వారి డిమాండ్‌ను ఆసరా చేసుకున్న అక్రమార్కులు భారీగా సిలిండర్‌లను నిల్వ చేసి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

ఏడున్నర వేలకుపైగా దుకాణాలు మూసివేత

గ్యాస్‌ కొరతతో జిల్లాలో వేల వ్యాపార సంస్థలు ఇప్పటికే మూతబడ్డాయి. సరిపడా గ్యాస్‌ అందుబాటులో లేకపోవటంతో కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెలు, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ పొయ్యిలను వినియోగిస్తున్నారు. అయితే వినియోగం పెరగటంతో కట్టెల రేటు పెరిగింది. దీంతో వ్యాపారాల్లో నష్టాలు చవిచూసి నిర్వాహకులు దుకాణం తెరిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలో మొత్తం 10,300 హోటళ్లు ఉండగా అందులో 2,600 వరకు మూతపడ్డాయి. అదే విధంగా 25,500 టీస్టాళ్లు ఉండగా అందులో 5,000 వరకు మూసేశారు. భోజన హోటళ్లు, ప్రైవేటు వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్‌ అందుబాటులో లేకపోవటంతో పూర్తిగా కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తూ మెనూను కుదించారు.

అక్రమ ఏజెన్సీలపై చర్యలేవి?

ఇటీవల నరసరావుపేట పట్టణంలో భారీగా కమర్షియల్‌ సిలిండర్‌లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిఫిన్‌ బండి యజమాని అక్రమంగా శ్రీనివాసనగర్‌లోని తన ఇంటిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌లను నిల్వ ఉంచాడనే సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 18 సిలిండర్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లోతైన విచారణ జరపకపోవటం, నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకోవటం విమర్శలకు తావిస్తోంది.

సత్తెనపల్లి రోడ్డులో క్యాటరింగ్‌ నిర్వాహకుడి కార్కానాపై పౌరసరఫరాల శాఖ అధికారులు 20 రోజుల క్రితం దాడులు నిర్వహించారు. దాడుల్లో 25 కమర్షియల్‌ సిలిండర్‌లను గుర్తించారు. సిలిండర్‌లు అన్ని సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని మొదట అధికారులు నానా హడావుడి చేశారు. చివరకు నిర్వాహకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకొని కేసును నీరుగార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని టీస్టాళ్ల వద్దకు తనిఖీలకు వెళ్లిన అధికారులు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వారి వద్ద నుంచి బెదిరించి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement