మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం | - | Sakshi
Sakshi News home page

మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం నేటి నుంచి విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవాలు అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం మోపిదేవి ఆలయానికి రూ.7.55 లక్షల ఆదాయం

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన రంగంశెట్టి జగదీష్‌ రూ.కోటీ యాభై లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అంగీకారపత్రాన్ని ఆలయ ఈవో కె.సునీల్‌కుమార్‌, ధర్మకర్త రంగప్రసాద్‌కి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అనివేటి మండపం, ప్రాకారం, పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్‌ ద్వారా రూ.ఆరు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఈవో తెలిపారు.

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుని మండలాభిషేక మహోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి స్వీయ పర్యవేక్షణలో మహోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు విఘ్న విమోచక హనుమంతునికి 108 కలశాలతో అభిషేక మహోత్సవం, విశేష అర్చనలు, అనంతరం తీర్థ ప్రసాదగోష్ఠి, సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ, హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్‌ చాలీసా పారాయణ, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుమంజన సేవ, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామానుజ సూత్తందాది, సాయంత్రం తిరువీధి ఉత్సవం, జగదాచార్యులు, భగవద్రామానుజులు అనుగ్రహించిన గద్యత్రయ పారాయణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పైకార్యక్రమాలలో పాల్గొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

వేటపాలెం: అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో వేటపాలేనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు ట్రిపుల్‌ జంప్‌ఽ కాంపిటిషన్లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు బ్యాంకాక్‌ దేశంలో థాయిలాండ్‌ అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలు జరిగాయి. 49 ప్లస్‌ వయస్సులో ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఉమాను స్నేహితులు అభినందించారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,55,030 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.3,86,53, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,26,665, స్వామి వారికి డొనేషన్లు రూపంలో రూ.1,73,217, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 28,800, దర్శనం ద్వారా రూ.33,900 కలిపి మొత్తం రూ.7,55,030 ఆదాయం వచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement