న్యూడ్‌ కాల్స్‌ కేసులో ముగ్గురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూడ్‌ కాల్స్‌ కేసులో ముగ్గురు అరెస్ట్‌

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

తెనాలిరూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్‌ కాల్స్‌ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్‌ కాల్స్‌ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్‌ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనూరాధ, మహమ్మద్‌ షహనాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్‌లైన్‌ వేదికగా ఓ యాప్‌లో ‘స్ట్రిప్‌ టాక్‌’ పేరిట ఉన్న పోర్టల్‌లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్‌ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్‌తో ఫోన్‌లో వీడియో కాల్‌ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్‌గా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. యాప్‌ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడంలో సహకరించిన అనూరాధ కుమారుడు హేమంత్‌ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్‌ చేశారు.

వదంతులు నమ్మవద్దు

ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనూరాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్‌ వివరాలు తెలుసుకుందని చెప్పారు. అనూరాధ, ఆమె కుమారుడు హేమంత్‌ సాయి యాప్‌ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్‌ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్‌సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేసిందని తెలిపారు. హేమంత్‌ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనూరాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని చెప్పారు. వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనూరాధకు షహనాజ్‌ పరిచయం కావడంతో ఇరువురు కలిసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనూరాధ తిరిగి తెనాలి చేరటం, అక్రమార్జనకు పాల్పడటం ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్‌ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామ చెప్పారు. సోషల్‌ మీడియా ప్రచారాలలో వాస్తవం లేదని, ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement