ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ హెచ్చరిక
రేపల్లె: ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ఆక్రమణల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ భూములను, నిరుపయోగంలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... భూముల స్థితిగతులు, రికార్డులు, భౌగోళిక పరిమితులను సమీక్షించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయా అనే అంశంపై అధికారుల నుంచి ఆరా తీశారు. భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, అవసరమైన చోట్ల సర్వేలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను సక్రమంగా వినియోగించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఆర్‌ఐ రాంబాబు, సర్వేయర్‌లు, వీఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


