కాలేయం వ్యాధులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

కాలేయం వ్యాధులపై అప్రమత్తం

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

కాలేయం వ్యాధులపై అప్రమత్తం

పెరుగుతున్న బాధితులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు సంగడిగుంటకు చెందిన సాకేత్‌ ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో సకాలంలో ఆహారం తీసుకోకుండా హోటల్స్‌లో ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తోటి సహచరులతో కలిసి మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి మద్యం సేవించటం వల్ల కాలేయానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని నిర్ధారించారు. మద్యానికి స్వస్తిపలికి వైద్యుల సలహాలతో మందులు వాడని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఇలా ఎంతో మంది లివర్‌ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు.

అతి పెద్ద గ్రంథి కాలేయం

కాలేయం (లివర్‌) మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. లివర్‌ పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అనేక మంది లివర్‌ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు లివర్‌ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్‌ క్యాన్సర్‌గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది లివర్‌ జబ్బులతో ప్రతి ఏడాది చనిపోతున్నారు. 2030 నాటికి లివర్‌ జబ్బులు 35 శాతం పెరుగుతాయి. లివర్‌ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్‌ 19న వరల్డ్‌ లివర్‌ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

లివర్‌ బాధితులు...

గుంటూరు జీజీహెచ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ వైద్యవిభాగంలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 130 మంది లివర్‌ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నవారు. ప్రతి ఏడాది 4000 మందికి పైగా వివిధ రకాల సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యవిభాగంలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువ శాతం మంది లివర్‌ సంబంధిత సమస్యలున్న వారేనని వైద్యులు తెలిపారు.

లివర్‌ చేసే పనులు...

మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయటం, జీర్ణక్రియకు దోహదపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్‌ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరం జబ్బు బారిన పడకుండా రక్షణ కల్పించటం, రక్త శుద్ధి చేయటం, శరీరంలోని విషాలను హరించటం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించటం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చటం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు త్వరగా మానటానికి కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయటం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది.

కాలేయ సమస్యలకు ముఖ్యకారణాలు

మత్తు పదార్థాలు సేవించటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడటం వల్ల హెపటైటిస్‌ బీ, సీ వ్యాధులు సోకుతాయి.

కలుషిత రక్తమార్పిడి, కలుషిత నీరు తాగటం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్‌ ఎ, ఇ వ్యాధులొస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి కాలేయంపై పేరుకుపోతుంది. నూనె వస్తువులు ఎక్కువగా తినటం, పిజ్జాలు, బర్గర్స్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ వల్ల లివర్‌ వ్యాధులు వస్తాయి. శరీరానికి హానిచేసే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మన రోగ నిరోధక శక్తి మనవైపే ప్రతికూలంగా పనిచేయటానికి అవకాశం ఉన్నప్పుడు , వంశపారంపర్యంగా కాలేయ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కళ్లు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కామెర్ల సమస్యలు ఉన్నట్లు భావించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం చేయని పక్షంలో లివర్‌ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement