మానవ సంబంధాలపై మొబైల్స్‌ తీవ్ర ప్రభావం | - | Sakshi
Sakshi News home page

మానవ సంబంధాలపై మొబైల్స్‌ తీవ్ర ప్రభావం

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

నగరంపాలెం: మొబైల్‌ ఫోన్లల్లో అవసరం లేనివి తొలగించినట్లు(డెలిట్‌) నేడు బంధాలు– మానవ సంబంధాలు తొలగించుకునే అంశాలుగా మారిపోతున్నాయని అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మురుగుడు శ్రీహరి రచించిన శ్రీహరి సిత్రాలు ఛాయా చిత్ర కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. పుస్తకాన్ని పెనుగొండ ఆవిష్కరించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహణలో బృందావన్‌గార్డెన్‌న్స్‌ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఆలయ సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు డాక్టర్‌ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్‌ తూములూరి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. పెనుగొండ మాట్లాడుతూ వందేళ్ల అనుబంధాలను క్షణాల్లో తెంచుకుంటున్న తీరుపై ఈ పుస్తక రచయిత తెగిపోతున్న బంధాలు పేరుతో కవిత్వం రాయడంపై హర్షం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన తూములూరి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సిరా చుక్క మౌనం వహిస్తే, సారా చుక్క రాజ్యమేలుతుందని అన్నారు. కవులు మౌనం వీడాలని, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవిత్వం రాయాలని ఆకాంక్షించారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ కవిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు రంగప్రవేశం చేస్తున్నాయని అన్నారు. ఛాయాచిత్ర కవిత్వం అనే కొత్త ప్రక్రియతో కవిత్వమై పుస్తకంగా మనముందుకొచ్చిన శ్రీహరిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పుస్తకాన్ని సుప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్‌ పరిచయం చేశారు. సభలో మోదుగుల రవికృష్ణ, ఆధ్యాత్మిక రచయిత పచ్చిపులుసు సూర్యనారాయణ, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బండికల్లు జమదగ్ని, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, కావూరి రవికుమార్‌ పాల్గొన్నారు.

అరసం జాతీయ అధ్యక్షుడు

పెనుగొండ లక్ష్మీనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement