మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ఈనెల 24, 25, 26 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్లు సంయుక్తంగా 16వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
● మొదటి రోజైన 24వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 కు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’ నాటిక, రాత్రి 9:30 నిమిషాలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటిక, రాత్రి 10:30 నిమిషాలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు ప్రదర్శిస్తారు.
● రెండో రోజు శనివారం రాత్రి 7:30కు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘ధర్మో రక్షతి’ నాటిక, రాత్రి 9. 30 నిమిషాలకు శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారి ‘ద్వార బంధాల చంద్రయ్య నాయుడు’ నాటిక, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శిస్తారు.
● చివరి రోజు ఆదివారం రాత్రి 7:30 కు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సుహాన నాటిక రాత్రి 9:30కు గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక రాత్రి 11. 30 నిమిషాలకు బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి ‘కన్నీటికి విలువెంత’ నాటికలు అనంతరం బహుమతి ప్రదానం ఉంటుందని సాంబశివరావు తెలిపారు. మార్టూరు పరిసర గ్రామాల ప్రేక్షకులు కార్యక్రమానికి విరివిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఫర్ట్ డైరెక్టర్ జేవీ మోహన్‌రావు, మార్టూరు రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏప్రిల్, 24, 25, 26 తేదీల్లో
రాష్ట్రస్థాయి పోటీలు


