అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధ క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం 4వ రోజైన ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పెనుగొండలోని శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ముఖ్య అతిథిగా హాజరై అనుగ్రహ భాషణం చేశారు. బాలస్వామి మాట్లాడుతూ మహా కుంభాభిషేకంలో కుంభ శాంతి చేసి దేవాలయాన్ని పునర్జీవింప చేసి నెగిటివ్ ఎనర్జి తొలగి మహాశక్తి వంతం అవుతుందని అన్నారు. మహా కుంభాభిషేకం మహా శక్తి సంపన్నం అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష మాట్లాడుతూ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసి సోమవారం 10 గంటలకు జరుగు మహా కుంభాభిషేకం తిలకించి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవాలయ ప్రధాన అర్చకులు చావలి శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో పండిత బృందం యజ్ఞాలు, యాగాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ పావులూరి సుబ్బారావు, గుంటూరు, కృష్ణా జిల్లాల టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ అధ్యక్షులు గట్టిపాటి శ్రీనివాసరావు, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి, ఆలపాటి రమాదేవి, ఉప్పల పద్మ, అరుణ, నన్నపనేని పద్మ, సువర్ణ, హరే శ్రీనివాస దాససాహిత్య ప్రాజెక్ట్ భజన సంఘాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి
గోవాడలో 4వ రోజు కొనసాగిన
మహాకుంభాభిషేకం


