జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్
కొల్లూరు: నీటి వనరులు అంతరించిపోతున్న తరుణంలో జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కోరారు. శనివారం మండలంలోని అనంతవరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, జలధార – జల హారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మొంథా తుపాను నష్టపరిహారం సైతం త్వరలో రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అనంతవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న కూడలిలో ప్రభుత్వ యంత్రాంగం, విద్యార్థులతో కలసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రదర్శనగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలసి మొక్క నాటారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రత్నమన్‌మోహన్, డీపీఓ కేఎల్ ప్రభాకరరావు, డీఆర్‌డీఏ పీడీ బి. శింగయ్య, డ్వామా పీడీ పి. పద్మ, ఎంపీడీఓ ఎ. స్పందన, తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
డొంక రోడ్లలో రవాణా దిగువ రైతుల హక్కు
పంట ఉత్పత్తుల తరలింపు కోసం తరతరాలుగా అందుబాటులో ఉంటున్న డొంక రోడ్ల విషయంలో ఒకరిద్దరు రైతులు అడ్డంకులు సృష్టించి ఇతరులను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం అనంతవరం జిల్లా పరిషత్తు పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో ఆయనకు రైతులు ఈ సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందించి, పొలాలకు ఉన్న బాటలలో రాకపోకలను అడ్డగించడం వల్ల మిగిలిన వారు అవస్థలు పడతారని తెలిపారు. అనంతరం కొల్లూరు శివారు కేటీ కాలనీ సమీపంలో బళ్ల బాట కోసం ఆందోళన చేస్తున్న రైతులు తమ సమస్యను కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. పరిష్కరించాలని రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవిని ఆయన ఆదేశించారు. అనంతవరంలో ఖరీప్‌లో వరి సాగు చేసి కేళీలతో పంట నష్టానికి గురైన రైతులు తమకు సంబంధిత విత్తన కంపెనీ నుంచి పరిహారం అందకపోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ శ్మశాన వాటికకు స్థల కేటాయింపు, 20 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలలో మెరకలు, ఇతర మౌలిక వసతుల కల్పన, డ్రైనేజ్‌ల నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, చెరువు కట్టల బలోపేతం, డొంక రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపై కలెక్టర్‌కు గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను శాఖల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అమతలూరి స్పందన పాల్గొన్నారు.


