బాపట్లటౌన్: అగ్ని ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అగ్నిమాపకాధికారి జి.రామ్‌సిద్దార్థ్ అన్నారు. అగ్నిప్రమాదాల నివారణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్నిమాపకాధికారి జి.రామ్‌సిద్దార్థ్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబయి ఓడరేవులో ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదం వలన 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 336 మంది ప్రజలు అక్కడికక్కడే మృతిచెందారని, వారి మృతికి చిహ్నంగా ప్రతి ఏడాది వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని అగ్నిప్రమాదం వలన ఎంతో విలువైన నగదు, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. వాటిని నివారించేందుకు అగ్నిమాపక సిబ్బందితోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు వంట సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాపట్ల అగ్నిమాపకాధికారి జి.రామ్ సిద్ధ్దార్థ్


