● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
● డీఎస్పీలతో సమీక్ష
బాపట్లటౌన్: నేరాలు, రౌడీయిజం నిర్మూలనే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ధ్యేయమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. కార్డన్ సెర్చ్ విధానం అమలుపై జిల్లాలోని డీఎస్పీలతో శుక్రవారం సాయంత్రం వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేర ప్రవృత్తి, రౌడీయిజాన్ని అరికట్టి, గంజాయి వంటి మత్తు పదార్థాలు, దొంగతనాలు, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను నిరోధించడానికి శాంతి భద్రతలను పరిరక్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సున్నితమైన ప్రదేశాలు, తరచూ నేరాలు జరిగే ప్రాంతాలు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఏకకాలంలో ఆ ప్రాంతాలను అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న వ్యక్తులను, రౌడీషీటర్లను, వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించడం, నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవడం, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగం ఉందేమోనని గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రౌడీషీటర్ల కదలికలు, జీవనశైలిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, ఎస్‌బీ2 సీఐ ఎం.రాంబాబు, వర్చువల్ విధానంలో రేపల్లె, బాపట్ల, చీరాల డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, సిహెచ్.చంద్రమౌళి, ఎండీ మోయిన్ పాల్గొన్నారు.


