ప్రజాభిప్రాయ సేకరణ వేదికలో నిలదీసిన అన్నదాత ఉప్పు నీటితో లంక గ్రామాలకు ముప్పు పొంచి ఉందని రైతుల ఆందోళన లోపభూయిష్ట నివేదికలు సవరించి క్వారీ అనుమతులివ్వాలని డిమాండ్
రైతుల ప్రయోజనమా...
ఏది ముఖ్యమో చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలని డిమాండ్
కొల్లూరు: రైతులు ముఖ్యమో.. ఇసుక తవ్వకాలు ముఖ్యమో.. తేల్చుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ రైతు ప్రశ్నించారు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల చోటుచేసుకునే పరిణామాలను ప్రజల నుంచి తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. శుక్రవారం మండలంలోని జువ్వలపాలెంలో రేపల్లె ఆర్టీఓ బి. శ్రీదేవి సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు.
ఉప్పు నీటి ప్రవేశానికి వీలుగా..
ఇసుక తవ్వకాల కోసం మైనింగ్ శాఖ గుర్తించిన 507 సర్వే నంబర్లో జువ్వలపాలెం – 2 ఇసుక క్వారీలో 24.90 హెక్టార్ల విస్తీర్ణంలో ఏడాదికి 3, 73, 500 టన్నుల ఇసుక తవ్వకాలు చేపట్టడానికి జరిపిన ప్రజాభిప్రాయ సదస్సులో ఆరుగురు మాట్లాడారు. వారి నుంచి భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. మండలంలోని తోకలవారిపాలెం శివారు కృష్ణానగర్‌కు చెందిన గొరిపర్తి వెంకట కృష్ణారావు అనే రైతు మాట్లాడుతూ.. ‘‘రైతులు ముఖ్యమా.. ఇసుక తవ్వడం ముఖ్యమా’’ అనేది తేల్చుకోవాలని పేర్కొన్నారు. చింతర్లంకకు చెందిన ప్రజా సంఘాల నాయకుడు తోడేటి సురేష్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇసుక తవ్వకాలతో సముద్రపు పోటు ద్వారా చొచ్చుకొస్తున్న ఉప్పునీరు లంక గ్రామాలలోకి వచ్చేందుకు గేట్లు తీసినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం జువ్వలపాలెం – 2 ఇసుక క్వారీకి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాల సైతం తీసుకోవాల్సి ఉంది. కేవలం నాలుగైదు గ్రామాల ప్రజలతోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమేంటని ప్రశ్నించారు.
లోపాటు సవరించాలి...
ప్రజల అభిప్రాయాలు సేకరించే ముందు వినిపించిన నివేదికలోని అంశాలు సైతం లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సవరించి మాత్రమే ఇసుక క్వారీ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల కారణంగా కృష్ణా నదిలో ప్రవాహ దిశ మారి పంట భూములు కోతకు గురవుతున్నాయని తెలిపారు. నివేధికలో వెల్లడిస్తున్నట్లు తాగు, సాగు నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోతే ఇప్పటికే రూ. 50 కోట్లు వెచ్చించి పోతార్లంక ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు ఎందుకు సరఫరా చేస్తున్నారని నిలదీశారు. లంక గ్రామాల ప్రజలు నిత్యం తాగునీరు ఎందుకు కొనుక్కుంటున్నారని ప్రశ్నించారు. నదిలో పశుగ్రాసానికి ఉపయోకరంగా ఉన్న పచ్చిక బయళ్లు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. తిప్పలకట్టకు చెందిన పంతగాని నాగమల్లేశ్వరరావు ఇసుక తవ్వకాల ద్వారా లభ్యమయ్యే ఆదాయం స్థానిక సంస్థలకు కేటాయించి అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక క్వారీ సర్వే నంబర్లు సక్రమంగా లేవని సరిచూసుకోవాలని సూచించారు. ఇసుక క్వారీ నుంచి తిరిగే వాహనాల కారణంగా రహదారిలో ప్రయాణించడం కష్టతరంగా ఉందని తెలిపారు. తక్షణం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని స్థానికుడు కృష్ణ కిశోర్ కోరారు. ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు జరగకుండా చూడటంతోపాటు ఉప్పు నీరు రాకుండా భట్టిప్రోలు మండలం ఓలేరు ప్రాంతం నుంచి చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టాలని జువ్వలపాలెం మాజీ సర్పంచి యార్లగడ్డ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన సునందారెడ్డి అనే ఎన్‌జీఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఇసుకను ఇతర రాష్ట్రాలకు విక్రయించి ఆదాయ వనరుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయ్‌మోహన్, మైనింగ్ ఏడీ జి. శ్రీనివాస్, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


