వైద్యుడి నియామకంలో కునికిపాట్లు | - | Sakshi
Sakshi News home page

వైద్యుడి నియామకంలో కునికిపాట్లు

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

● నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన కు.ని. ఆపరేషన్లు ● గతేడాది డిసెంబర్‌లో వైద్యుడి సస్పెన్షన్‌ తర్వాత ఆగిపోయిన సేవలు

నరసరావుపేట టౌన్‌: ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను ఐదు నెలల క్రితం సస్పెండ్‌ చేసి ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ నియంత్రణ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేకపోవటం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు ఆశ్రయించడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. రోజూ ఎనిమిది నుంచి పది వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు జరిగేవి. సగటున నెలకు సుమారు 200కుపైగా నిర్వహించేవారు. గతేడాది నవంబర్‌ నెలలో ఓ మహిళకు ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్‌ టి. నారాయణస్వామి సర్జికల్‌ బ్లేడును తొడ భాగంలో వదిలేశారు. రోగి బంధువులు ఆందోళన చేయటంతో విచారణ జరిపిన అధికారులు... డాక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌ శౌరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. వారిద్దరిని గతేడాది డిసెంబర్‌ 5వ తేదీన అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ స్థానంలో మరో డాక్టర్‌ను ఇప్పటివరకు నియమించలేదు. సంఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పీపీ యూనిట్‌ విభాగంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు రోగులు వచ్చి వెనుతిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది.

వైద్యం లేదు.. ప్రోత్సాహకం రాదు

కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషనుకు రూ.1,500, పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సకు రూ.2,000కుపైగా అందించటం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల వైపు ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. దీంతోపాటు ప్రయాణ భత్యం, ఆపరేషన్‌ తర్వాత ఉచిత మందులు, చికిత్స అందిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆశ వర్కర్‌లకు కూడా ప్రోత్సాహకం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్‌లు లేకపోవటంతో ఈ ప్రయోజనాలన్నీ దక్కటం లేదు. ఒకవైపు ఉచిత వైద్యం కోల్పోతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అందడం లేదు.

ఆరోగ్యానికి ముప్పు..

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఎక్కువగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. ఆలస్యం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. కుటుంబ నియంత్రణ లేకపోవటం వల్ల అనుకోని గర్భధారణలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్యంపై ప్రభావం చూపి సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు.

ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడి నియామకం జరగక ఐదు నెలలైనా పట్టించుకున్న నాథుడు లేడు. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసే వారే కరువయ్యారు. పల్నాడు

జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కనీసం కు.ని. ఆపరేషన్లు కూడా చేయించలేని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement