బాపట్ల: జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. మాతృ మరణాలపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు జరగడానికి వీలులేదన్నారు. ఇటీవల మూడు మరణాలకు గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, గర్భధారణ కాలంలో నిరంతర వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. హైరిస్క్‌గా ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రసవ నొప్పులు మొదలవగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లేదా 108 వాహనాల ద్వారా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ సిబ్బంది గ్రామ స్థాయిలో గర్భిణులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో తక్షణమే పైస్థాయి వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మరింత మెరుగుపరచి, ప్రసవ సేవలను నాణ్యంగా అందించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మావతి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, ఎండీఎస్‌ఆర్ కమిటీ సభ్యులు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
పురపాలక సంఘం పెట్రోల్ బంకు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల పట్టణం పాత బస్టాండ్ కూడలి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పురపాలక సంఘం పెట్రోల్ బంకు పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనులు మే నెలాఖరిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. 507.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బంకు ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయం ఇక్కడ అందుబాటులో ఉంచాలన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెంట పురపాలక సంఘం కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ షాలీమా, మున్సిపల్ ఇంజినీర్ కృష్ణారెడ్డి ఉన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


