క్షౌరశాలలకు ఉచిత విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

క్షౌరశాలలకు ఉచిత విద్యుత్‌

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

క్షౌరశాలలకు ఉచిత విద్యుత్‌ ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం

తెనాలిటౌన్‌: రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు 200 యూనిట్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇస్తుందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె.రఘురామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల 200 యూనిట్లలోపు ఉన్న క్షౌరశాలలకు విద్యుత్‌ బిల్లులను మాఫీ చేసినట్లు చెప్పారు. నిర్వాహకులు ఆదాయ సర్టిఫికెట్‌, షాపు ఓనర్‌ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును సబ్‌మీట్‌ చేయాలని సూచించారు. పట్టణాలలో సంవత్సర ఆదాయం రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు ఉండాలని జీఓ ఉండగా ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్‌ సర్టిఫికెట్‌ తహసీల్దార్‌ నుంచి పట్టణాల్లో సంవత్సర ఆదాయం రూ.1,44,000, గ్రామీణప్రాంతాల్లో రూ.1,20,000 ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యుత్‌శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అక్కల సత్యనారాయణ కోరినట్లు వివరించారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని విద్యుత్‌ అధికారులకు అందజేయాలని సూచించారు.

నరసరావుపేట రూరల్‌: ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఉద్యమంలా సాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐసీఆర్‌పీలు, ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌ బృందాలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతులు పీఎండీఎస్‌ విధానాన్ని అవలంబించాలని సూచించారు. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వలన సూపర్‌ ఎల్‌నినో రాబోతుందని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి రైతు వేసవి కాలంలో బెట్టను తట్టుకుని దిగుబడినిచ్చే పంటలు ఎన్నుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం కె.అమలకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement