ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ

అసైన్డ్‌ భూముల్లో భారీగా తవ్వకాలు రోజుకు 100 ట్రాక్టర్లు, 50 టిప్పర్లతో రవాణా మామూళ్ల మత్తులో రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు

పచ్చనేతలు బరి తెగించారు. ఇసుక దిబ్బలను యథేచ్ఛగా మింగేస్తున్నారు. తవ్విన ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఉచిత పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదేమని అడిగే వారే లేరు.

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: చీరాల నియోజకవర్గ ప్రధాన నాయకుడు.. అనుచరులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా ఇసుక తరలింపు కోసం మాఫియా నాయకులు రూ. లక్షల మేర ప్రధాన నాయకుడికి కప్పం కడుతున్నారు. ఉచితం మాటున యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ తరలింపు వ్యవహారం తెలిసినా మామూళ్ల మత్తులో డ్రైనేజీ, రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి, రామన్నపేట, సముద్రతీర గ్రామాల పరిధిలో అసైన్డ్‌, వాన్‌పిక్‌ భూముల నుంచి పొక్లెయిన్‌లతో తవ్వి ట్రాక్టర్లు, లారీ టిప్పర్లతో నూతనంగా వేసే లేఅవుట్‌లకు నిత్యం వందల సంఖ్యలో ఇసుక లోడులు తరలిస్తున్నారు. ప్రతి రోజూ 100 నుంచి 150 లోడ్ల వరకు డంప్‌ అవుతున్నాయి. ట్రాక్టర్‌ ఇసుక రూ.4000 నుంచి రూ.5000కు విక్రయిస్తున్నారు. టిప్పర్‌ ఇసుక రూ. 25000 నుంచి క్వాలిటీని బట్టి రూ.40 వేలకు రాత్రి వేళల్లో తరలించి జేబులు నింపుకుంటున్నారు.

ప్రధాన అనుచరుడే కీలకం...

చీరాల నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. పందిళ్లపల్లి, రామన్నపేట, బొచ్చులవారిపాలెం, చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట గ్రామాల నుంచి అక్రమంగా అసైన్డ్‌ భూముల్లోని ఇసుక కొల్లగొడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన నాయకుడికి రూ.లక్షలు కప్పం కట్టి వారి అనుచరులే ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరు అనుచరులు ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తలించి డబ్బులు వసూలు చేస్తుంటారు.

కొమ్ముకాస్తున్న పోలీసులు

చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని హుకుం జారీ చేయడంతో చీరాల ప్రాంతంలో పచ్చనేత ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా అమ్ముకోవడానికి వీలులేదు. కాదూ కూడదని తరలించే ప్రయత్నం చేసినా వెంటనే తహసీల్దార్‌, పోలీసులకు చెప్పి ఆ ట్రాక్టర్లను సీజ్‌ చేయిస్తారు.

ఆదేశాలు పేపర్లకే పరిమితం..

చీరాల నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్‌, ఆర్డీఓ ఆదేశాలు పేపర్‌ ప్రకటనలకే పరిమితమయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక టాక్టర్లు రాత్రి, పగలు తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు. వారికి ప్రతి నెలా అందుతున్న మామూళ్ల వల్లే ఉన్నత అధికారులు ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement