కొల్లూరు: బళ్ల బాట విషయంలో రాజకీయ నాయకుల వత్తిళ్లకు రెవెన్యూ అధికారులు తలొగ్గడం రైతులు రోడ్డెక్కి నిరసనలకు దిగడానికి దారితీసింది. అన్ని వర్గాలకు చెందిన సన్న, చిన్నా కారు రబీలో పండించిన పంట ఉత్పత్తులు తరలించుకోవడానికి ఉన్న బళ్లబాటను ఒకరిద్దరు మోతుబరి రైతులు చెరబట్టడంతో కడుపు మండిన కర్షకులు ఽఆందోళనకు దిగారు. 200 ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో సాగైన జొన్న, మొక్కజొన్న, ధాన్యం ఉత్పత్తులు తరలింపును అడ్డుకుంటూ బళ్లబాటను చెడగొట్టిన రైతులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండుతో బక్క రైతులు రహదారిపై బైఠాయించి గొంతెత్తి నినదించారు. మోతుబరి రైతులకు అధికార టీడీపీకి చెందిన నాయకులు కొమ్ముకాస్తూ దిగువ పొలాలకు బళ్లబాట లేకుండా చేస్తున్నారన్న ఆవేదనతో రైతులు ధర్నాకు దిగారు. టీడీపీ నాయకుల ఆదేశాలను పాటిస్తున్న రెవెన్యు అధికారులు రైతుల పొట్టకొడుతున్నారంటూ రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై మండుటెండలో బైఠాయించారు.
మాటదాటేసి మభ్యపెట్టడంతో...
కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద గత కొద్ది కాలంగా పంట భూములకు ఉన్న బళ్లబాట విషయంలో వివాదం నడుస్తుంది. లోపల పంట భూములున్న సన్న, చిన్నకారు రైతులు పంట దిగుబడులు, ఎరవులు తరలింపుకు వీలుగా బళ్లబాట ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల రాకపోకలు జరగకుండా ఒకరిద్దరు పెద్ద రైతులు బళ్లబాటను తవ్వించడంతో వివాదం ముదిరింది. తమకు న్యాయం చేయాలని రైతులు సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయంలో బైఠాయించి నిరసనకు దిగారు. దీనితో తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు వివాదాస్పదమైన బళ్లబాటను పరిశీలించి బుధవారం నుంచి రాకపోకలు సాగేలా చూస్తానని రైతులకు భరోసా కల్పించి నిరసనను విరమింపజేశారు. అయితే బుధవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయం వద్దకు వచ్చిన రైతులు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో తహసీల్దార్ టీడీపీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి రైతులను మభ్యపెట్టి, మాటదాటవేచి మోతుబరీ రైతుల పక్షాన నిలుస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన రైతులు కొల్లూరు బస్టాండ్ సెంటర్లో రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిలో ధర్నాకు ఉపక్రమించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు రైతులను విషయం అడిగి తెలసుకొని ధర్నాను విరమించాలని సూచించారు. రైతులు ససేమిరా అనడంతో రికార్డులు పరిశీలించి రెవెన్యు అధికారుల సమక్షంలో న్యాయం చేస్తామని ప్రజలకు ఇబ్బంది కల్పించడం తగదని సూచించడంతో రైతులు ధర్నాను విరమించి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. రేపల్లె ఆర్డీఓ, తహసీల్దార్‌ల సమక్షంలో సమస్య సామరస్యంగా పరిష్కరిస్తానని సీఐ భట్టిప్రోలు మండలంలో ఇతర కార్యక్రమానికి వెళ్లడంతో రైతులు తిండీ, తిప్పలు మానుకొని వారి కోసం 4 గంటలపాటు పడిగాపులు కాశారు.
బళ్ల దారి కోసం కార్యాలయాల బాట
దారి విషయంలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న సన్న, చిన్నకారు రైతులు తమకీ దుస్థితి పట్టించిన అధికార టీడీపీ నాయకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం వివాదాస్పదమైన దారి వద్దకు వచ్చిన రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని రైతులకు తెలపడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురయ్యారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా, దారి లేకుండా చేసిన ఒకరిద్దరు రైతుల కోసం ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆమెకు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కారం విషయంలో కాలయాపన జరిగితే పంట వ్యర్ధాలకు ఇతర రైతులు నిప్పు పెడితే తమ పంట సైతం బుగ్గిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎటువంటి అన్యాయం చేయకుండా, రెవెన్యు రికార్డులు, బళ్లబాటను అడ్డగించిన వ్యక్తుల రికార్డులు, రైతులు, ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. ఆర్డీఓ హామీతో మెత్తబడిన రైతులు ఆందోళనను విరమించి గురువారం రేపల్లె ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు.
బళ్ల బాట ఏర్పాటులో ‘పచ్చ’పాతంపై రైతుల ఆగ్రహం
దారి విషయంలో అధికారులపై
టీడీపీ నాయకుల ఒత్తిళ్లు
బళ్ల దారి ఏర్పాటులో రెవెన్యూ యంత్రాంగ వైఫల్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు
రేపల్లె – తెనాలి ప్రధాన రహదారిపై ధర్నా
రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని రేపల్లె ఆర్డీఓ హామీ


