రేపల్లె: ఆసక్తి ఉంటే గురువు అవసరం లేదు. కష్టపడితే ప్రతిభకు అడ్డంకులు ఉండవు అనే మాటలను నిజం చేస్తూ ముందుకు సాగుతోంది వరికూటి ముగ్ధశ్రీ. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు సమీపంలోని వరికూటివారిపాలెం గ్రామానికి చెందిన ముగ్ధశ్రీ చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై అపారమైన ఆసక్తి పెంచుకుంది. ప్రత్యేకంగా ఎలాంటి గురువు లేకుండానే స్వయంకృషితో చిత్రకళలో నైపుణ్యాన్ని సాధించి ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్ధశ్రీ చదువుతో పాటు తన అభిరుచిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సాధారణ కాగితం, పెన్సిల్‌తో ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఇప్పుడు అద్భుతమైన చిత్రాల రూపంలో కళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రతి చిత్రంలో భావం, శ్రద్ధ, సృజనాత్మకత ప్రతిబింబించేలా చిత్రీకరిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ముగ్ధశ్రీ తండ్రి రాము వరికూటి, తల్లి లీలా కరుణశ్రీ తమ కుమార్తె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఆమె ఎదుగుదలకు ప్రధాన కారణం. గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్పటికీ, తన ప్రతిభతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే పట్టుదల ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఆకర్షణీయంగా చిత్రించిన పలు చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
చిత్రలేఖనంలో
ప్రతిభ చాటుతున్న ముగ్ధశ్రీ


