విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు
మార్టూరు: విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన వలపర్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో మండలంలోని వలపర్ల గ్రామంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లు లాగుతున్నారు. ఈ పనుల కోసం జార్ఖండ్‌కు చెందిన యువకులను మరికొందరిని నియమించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం దిలీప్, తాపేశ్వర్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి వైర్లను బిగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో దిలీప్ షాక్ తగిలి తీగలపై వాలిపోయాడు. చేతికి స్వల్ప గాయమైన తాపేశ్వర్ అరుస్తూ కింద ఉన్న మిగిలిన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు సరఫరా నిలిపివేశారు. స్పృహ కోల్పోయిన దిలీప్‌ను స్థానికులు కిందకు దించి మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుభవం లేని కూలీలను స్తంభాలు ఎక్కించి, లైన్‌మెన్ పనులు చేయించడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు.
లారీ ఢీకొట్టంతో ద్విచక్ర వాహనదారుడు మృతి
భట్టిప్రోలు: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఎన్‌హెచ్–216 జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. భట్టిప్రోలు ఎస్‌ఐ ఎం. శివయ్య కథనం ప్రకారం గుంటూరుకు చెందిన ఎస్‌కే అహ్మద్ వలీ (27) చెరుకుపల్లి మండలంలోని గూడవల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి గూడవల్లికి బైక్‌పై వచ్చాడు. అక్కడి నుంచి రేపల్లెకు వ్యక్తిగత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా భట్టిప్రోలు సమీపంలో సూరేపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగుతుండగా వెనుకనుంచి వేగంగా లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అహ్మద్ వలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివయ్య తెలిపారు.
విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు


