వదలని ‘మత్తు’.. యువత చిత్తు
● రైళ్లలో గంజాయి రవాణా
చేస్తున్న అక్రమార్కులు
● రెండు నెలల కాలంలో
49 కేజీల పట్టివేత
● మత్తుకు బానిసలుగా మారిన
విద్యార్థులు, యువత
● గంజాయి రవాణా, వినియోగం
తగ్గించే చర్యలు శూన్యం
చీరాల: ఒకప్పుడు బాపట్ల అంటే ఉన్నత చదువులకు చిరునామాగా ఉండేది. ప్రస్తుతం గంజాయికి అడ్డాగా మారింది. వైజాగ్ నుంచి కొన్ని ముఠాలు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల ద్వారా విజయవాడ, బాపట్ల, రేపల్లె, వెదుళ్లపల్లి, చీరాలకు భారీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి చిరువ్యాపారుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు జులాయిల్లా మారిపోతున్నారు. ఉన్నత చదువులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. గంజాయి మత్తులో ఘర్షణలకు దిగుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చీరాల ప్రాంతంలో అనేకం ఉన్నాయి.
రైళ్లలో యథేచ్ఛగా రవాణా
గతంలో రోడ్డు మార్గంలో గంజాయిని రవాణా చేసిన అక్రమార్కులు తమ పంథా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రైళ్లలో గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు. ఈగల్ టీం, పోలీసులు, రైల్వే, ఆర్పీఫ్ పోలీసులు కలసి ఆగస్టులో తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేయగా 8 కిలోల గంజాయి లభించింది. అప్పట్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 5న ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేసి నాలుగు కిలోల గంజాయి పట్టుకున్నారు. అక్టోబర్ 24న చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో 16 కిలోలు గంజాయి లభించింది. పూరి –తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేయగా బ్యాగుల్లో కేరళ తరలిస్తున్న 21 కిలోల గంజాయి దొరికింది. ఈ నెల 3న పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో రెండు కిలోలు చిక్కింది. గత ఏడాది మార్చిలో కత్తిపూడి – ఒంగోలు రోడ్డులో కంటైనర్‌లో ఫర్నీచర్ మాటున 240 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు.
మాటలకే సర్కారు పరిమితం
ముఠాలు ఒడిశా నుంచి రైలులో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నాయి. గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కనీసం రవాణాను కూడా అరికట్టలేకపోతోంది. కేసుల్లో దొరికిన వారంతా కూడా చిన్నస్థాయి వారే. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్న అసలు సూత్రధారులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. గత ప్రభుత్వం గంజాయి ఆక్రమ రవాణా నిరోధించేందుకు సెబ్‌ను ఏర్పాటు చేసింది. సెబ్, పోలీసులు స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచి ఎక్కడికక్కడ అరికట్టే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గంజాయి రవాణా జోరందుకుంది. గత ఏడాది తెల్లవారుజామున 5 గంటలకు ఈపురుపాలేనికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఆమైపె విచక్షణరహితంగా దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట గంజాయి మత్తులో అల్లరిమూకలు యథేచ్ఛగా నేరాలకు, గొడవలకు పాల్పడుతూనే ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి రవాణా, వినియోగం పెరిగింది. మత్తుకు చీరాల యువత చిత్తవుతోంది. చీరాలతోపాటు జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా బహిరంగంగానే సాగుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుంటూ స్మగ్లర్లు ఈ దందాలో చెలరేగిపోతున్నారు. చదువు మధ్యలో మానేసి చెడు అలవాట్లకు బానిసలైన వారిని ఎంచుకుని గంజాయి వ్యాపారాన్ని రోజు రోజుకూ విస్తరిస్తున్నారు.


