సమ్మేటివ్ పరీక్షల తనిఖీ
వేటపాలెం: సమ్మేటివ్–1 పరీక్షలను జిల్లా ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ కె.శివకుమార్ తనిఖీ చేశారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను సోమవారం పరిశీలించారు. పదో తరగతి వంద రోజుల కార్యచరణ ప్రణాళిక సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల అపార్ ఐడీ వంద శాతం నమోదు, ఈఈఎంటీ పరీక్ష రిజిస్ట్రేషన్ గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. గతంలో పదో తరగతి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత అయ్యే విధంగా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ ఐ.పురుషోత్తం ఉన్నారు.
కర్లపాలెం: కారు, ట్రాక్టర్ ఢీకొని ఇరువురికి గాయాలైన ఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. భీమవరం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు బాపట్ల నుంచి సిమెంటు రాళ్ల లోడుతో కర్లపాలెం వస్తున్న ట్రాక్టర్, సత్యవతీపేట వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న జయశ్రీకి ట్రాక్టర్ డ్రైవర్ మంత్రయ్యకు గాయాలయ్యాయి. వీరిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
చీరాల: పంట పొలాల్లో పేకాట శిబిరాన్ని సోమవారం చీరాల రూరల్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ ద్వారా కనుగొన్నారు. ఈపురుపాలెం ఎస్‌ఐ ఎ.చంద్రశేఖర్ అందించిన వివరాల మేరకు.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ, రూరల్ సీఐ సూచనలతో చీరాల మండలం నక్కలవారిపాలెం పొలాల్లో పేకాటాడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.1.69 లక్షల, 14 సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేశారు.
సమ్మేటివ్ పరీక్షల తనిఖీ


