జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం ఏర్పాటు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం నూతన కార్యవర్గం సోమవారం జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు, ప్రతినిధుల వివరాలు తెలిపారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎస్.శ్రీనివాసరావు (సత్తెనపల్లి), కార్యదర్శిగా ఎం.వెంకటనరసయ్య (పిడుగురాళ్ల), కోశాధికారిగా వి.మధుబాబు (పిడుగురాళ్ల) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సంఘం ఉపాధ్యక్షుడిగా బి.మల్లికార్జునరావు(మాచర్ల), జాయింట్ సెక్రటరీగా డి.సైదులు (సతైనపల్లి), మహిళా కార్యదర్శిగా పి.లక్ష్మీదేవి (దుర్గి), రాష్ట్ర కౌన్సిలర్‌గా డి.జి.బుల్లయ్య (వినుకొండ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి వెంకటనరసయ్య మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ, ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారుల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలిపారు.
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు సోమవారం తెలిపారు. జాబ్‌మేళాలో దాదాపు 35 కంపెనీలు పాల్గొని అర్హత గల అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయని వివరించారు. అభ్యర్థుల అర్హత, ఉద్యోగం మేరకు రూ.13వేలు నుంచి రూ.40వేలు వరకు జీతం, ఇతర సదుపాయాలు లభిస్తాయని తెలిపారు. జాబ్‌మేళాకు పదవ తరగతి నుంచి పీజీ, డిప్లమో, ఇంజినీరింగ్, ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత హాజరు కావాలని కోరారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. అవకాశానిన నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 9160200652, 9100566581 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


