బాబూ.. నీ నాయకత్వం మాకొద్దు !
నాదెండ్ల: గ్రామంలో నీ నాయకత్వం మాకొద్దు బాబు అంటూ సాతులూరు గ్రామంలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ నాయకత్వం వద్దంటూ ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ ఒంటెత్తు పోకడల కారణంగా మండలంలో టీడీపీ క్యాడర్ దెబ్బతింటుందని మండిపడ్డారు. మండలంలోని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పనులు చేయించుకోవాలన్నా, సత్యనారాయణ చెప్పందే చేయమంటూ అధికారులు చెప్పటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. తాము పార్టీకి ఓటేశామని, మా పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదన్నారు. గ్రామంలో నేటి వరకూ ఒక్క సమస్యనూ బండారుపల్లి పరిష్కరించలేకపోయాడని విమర్శించారు. ఎవరైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడని, ఒకవేళ ఫోన్ ఎత్తినా చులకనగా మాట్లాడడం, ఎద్దేవా చేయటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణ చేసే అక్రమాలను ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో బెదింరింపులకు పాల్పడటం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. మండలంలోని ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారన్నారు. సత్యనారాయణ ఒంటెత్తు పోకడలను త్వరలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. వారు చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌లను స్వయంగా కలిసి సమస్యలను వివరిస్తామని తెలిపారు. సమావేశం నిర్వహించిన వారిలో గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ నార్నె శరభయ్య, మాజీ సర్పంచ్ గొట్టిపాటి వెంకటరమణ, టీడీపీ మాజీ గ్రామ అధ్యక్షుడు నార్నె సాంబయ్య, యర్రం యల్లమందయ్య, నాయకులు నర్రా శ్రీనివాసరావు, వేజెండ్ల శివకోటేశ్వరరావు, వేజెండ్ల శ్రీనివాసరావు, నర్రా కోటేశ్వరరావు, నాదెండ్ల మనోజ్‌కుమార్, ధూళిపాళ్ళ శివనాగశివేంద్ర, నర్రా నాగబాబు, పొన్నం ప్రసన్నకుమార్ ఉన్నారు.


