మెడికల్ కళాశాల సందర్శన
● రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను
ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
● మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ
రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు
బాపట్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయటం కేవలం ముడుపుల కోసమేనని మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ఆరోపించారు. మెడికల్ కళాశాలను కాపాడుకోవాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బాపట్లలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను సందర్శించి ఎన్జీవో హోంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. వైద్యరంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించి బాపట్ల వైద్య కళాశాలను నిర్మించాలన్నారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఈ కళాశాలను కాపాడుకోవాలని, పీపీపీ విధానంలో పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ఇచ్చిన 590 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైద్య విద్యను, అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చెయ్యాలనే ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రైవేటీకరణతో కోటీశ్వరుల పిల్లలకే మెడికల్ సీట్లు దక్కుతాయన్నారు. అర్హత గల పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంత దుస్థితిలో ప్రభుత్వం ఉందా?
రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి. రమాదేవి డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే నినాదంతో బాపట్లలో మొదలుపెట్టిన కళాశాల నిర్మాణం కొనసాగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. కళాశాల నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయన్నారు.
అమ్మకానికి పెట్టిన కూటమి సర్కారు
సదస్సులో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కార్పొరేట్ వైద్య సంస్థలకు కళాశాలలను కట్టబెట్టడం దారుణమన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదన్నారు.
తొలుత బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, పరిరక్షణ కమిటీ బృందం, ప్రజా, పౌర సంస్థల నేతలు పరిశీలించారు. గత 17 నెలలుగా బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అదనంగా ఎలాంటి నిర్మాణం జరగలేదని, ఇక్కడి నుంచి కొంత ఇనుమును పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు తరలించినట్లు గుర్తించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట అంజి బాబు, సీపీఐ కార్యవర్గ సభ్యుడు పరుచూరి రాజేంద్ర బాబు, బాపట్ల జిల్లా కార్యదర్శి సింగరకొండ, ప్రభుత్వ మెడికల్ కళాశాలల కో కన్వీనర్ కె. వసుంధర, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.జె. విద్యాసాగర్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు మేధ శ్రీనివాసరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దర్శి విష్ణు శంకర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు


