రైతులకు కూటమి పోటు!
రైతులకు కూటమి పోటు!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో గత నెల 27, 28వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు కూటమి ప్రభుత్వం తేల్చింది. ఇందులో అత్యధికంగా 25,575 ఎకరాల్లో వరి, 3,520 ఎకరాల్లో మినుము,1,890 ఎకరాల్లో పత్తి, 2,572 ఎకరాల్లో మొక్కజొన్న, 42 ఎకరాల్లో వేరుశనగ, 45 ఎకరాల్లో కంది, 4 ఎకరాల్లో సోయాబీన్, 12 ఎకరాల్లో పెసర, 7 ఎకరాల్లో జూట్ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. 1,902 ఎకరాల్లో అరటి, 230 ఎకరాల్లో మిర్చి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ తేల్చింది. మొత్తం 35,789 ఎకరాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి వరద ప్రభావంతో పంటలు భారీ ఎత్తున దెబ్బతిన్నా మొక్కుబడిగా పంట నష్టం జరిగినట్లు చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖరీఫ్‌లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 2 లక్షల ఎకరాలకుపైగా వరి సాగైంది. పదిరోజుల క్రితం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 5 నుంచి 26 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. తొమ్మిది మండలాల్లో 20 సెంటీమీటర్లు పడింది. మరో పది మండలాల్లో 10 నుంచి 18 సెంటీమీటర్ల కురిసింది. కేవలం 5 మండలాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద పొంగి పొర్లడంతో పలు పంటలు పెద్ద ఎత్తున నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఆ మేరకు 66,033 ఎకరాల్లో వరి నీట మునిగిందన్నారు. 4,564 ఎకరాల్లో మినుము, 3,105 ఎకరాల్లో పత్తి, 2,816 ఎకరాల్లో మొక్కజొన్న, 840 ఎకరాల్లో వేరుశనగ, 504 ఎకరాల్లో కంది, 74 ఎకరాల్లో సోయాబీన్, 54 ఎకరాల్లో పెసర పంటలకు నష్టం జరిగినట్లు తేల్చారు. ఇక 2,285 ఎకరాల్లో అరటి, 1,740 ఎకరాల్లో కూరగాయలు, 1,142 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు లెక్కలు కట్టారు. మొత్తంగా 83,160 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
తుపాను ప్రభావం ముగిసిన తర్వాత ఎగువన గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్చూరు వాగు, రొంపేరు, కొమ్మమూరు కాలువలు భారీగా పొంగిపొర్లాయి. పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో 50 వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. ఇందులో 90 శాతం పంట నీటిలోనే కుళ్లి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఆ లెక్కన మరో 30 వేల ఎకరాల వరి పంటకు నష్టం జరగడంతో మొత్తంగా 1.10 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
వరద ప్రభావంతో పంటనష్టం అధికంగా ఉన్నా అధికారుల అంచనాలు చూస్తే రెండింతలు తగ్గించినట్లు తెలుస్తోంది. కారంచేడు, పర్చూరు, వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల్లో 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలో కుళ్లిపోగా ఈ ప్రాంతంలో 25 వేల ఎకరాలు మాత్రమే దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా కట్టారు. వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాలలోనూ వరి పంట పెద్ద మొత్తంలో దెబ్బతిన్నా నామమాత్రంగా నష్టం తేల్చారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలలో మినుము, సోయాబీన్, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగినా పూర్తిస్థాయిలో లెక్కించలేదు. ఈ– క్రాప్ కాకున్నా పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నిజం కాదని తేలుతోంది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించి నష్టం జరిగినప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు బీమా మొత్తాన్ని ఇచ్చి రైతులను ఆదుకుంది. కూటమి ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. దీనిపై అవగాహన లేక కొందరు రైతులు ప్రీమియం భారంగా మారడంతో సాగు చేసిన పంటలను బీమా చేయించుకోలేక పోయారు. ఈ– క్రాప్‌తోపాటు బీమా చేసుకోని వారి పంట నష్టం వివరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నమోదు చేయలేదన్న ఆరోపణలుఉన్నాయి.
పంట నష్టం లెక్కల్లో అన్నదాతలకు తీరని అన్యాయం
ప్రాథమిక అంచనా ఇలా..
కుళ్లిపోయిన వరి పంట
మొక్కుబడిగా నష్టం లెక్కలు
మోంథా తుపాను రూపంలో ప్రకృతి అన్నదాతలను అతలాకుతలం చేస్తే... ఆదుకునే మనసు లేని కూటమి సర్కారు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. పంట నష్టం అంచనాల్లో కోతపెట్టి వంచించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ప్రాథమిక అంచనాల్లో భారీ నష్టం చూపిన ప్రభుత్వం చివరకు వచ్చేసరికి మొక్కుబడిగా మార్చింది. అన్నదాతల కడుపుకొట్టడంతో పాలకులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టం అంచనాల్లో
పొంతన లేని లెక్కలు
ప్రాథమికంగా 83,160
ఎకరాల్లో నష్టం
ఎన్యుమరేషన్ తరువాత
35,789 ఎకరాలే
పర్చూరు, చీరాల ప్రాంతాల్లో
పెరిగిన వరద ప్రభావం
50 వేల ఎకరాల్లో మునిగిన పంటలు
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో
నీటిలోనే వరి పంట
నష్టం అంచనాలను భారీగా
తగ్గించిన ప్రభుత్వం
తీవ్ర ఆందోళనలో బాధిత రైతులు
కూటమి సర్కార్ తీరుపై మండిపాటు
1/1
రైతులకు కూటమి పోటు!