
విలువైన కార్డులు అప్పగింత
బల్లికురవ: విలువైన ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ ప్యానెళ్లు పొగొట్టుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకుని అప్పగించడంతో శనివారం ఎస్సై వై. నాగరాజు అభినందించారు. పల్నాడు జిల్లా పిట్టంబండ గ్రామానికి చెందిన ఆర్. బాలాజీసింగ్ వృత్తి రీత్యా డిజిటల్ పేమెంట్ ప్యానెళ్ల వ్యాపారంచేస్తున్నాడు. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో బైక్‌పై తిరుగుతుంటాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం మేదరమెట్ల – నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని కొప్పరపాడు గ్రామం మీదుగా వరపల్ల వెళుతుండగా మార్గ మధ్యంలో విలువైన బుక్స్, కార్డులు, ప్యానెళ్లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్కుల బ్యాగ్ బైకుపై నుంచి కిందపడింది. కొప్పరపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు దమ్ము అంజయ్య బైక్‌పై బల్లికురవ వెళుతూ బ్యాగ్ గమనించి.. దానిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి అప్పగించారు. వివరాలు సేకరించి.. బాధితుడిని పిలిపించి అప్పగించారు. ఎంతో విలువైన తన బ్యాగ్‌ను అప్పగింటం పట్ల బాలాజీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో వ్యక్తి మృతి
మార్టూరు: పిచ్చికుక్క దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని కోలల పూడి గ్రామంలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోలల పూడి గ్రామంలో ఈనెల మొదటి వారంలో ఓ పిచ్చికుక్క 12 మంది వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాడిలో గాయపడిన వారిలో కొందరు మార్టూరు, మరికొందరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వారిలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన గాలి యేసులు (65) చికిత్స చేయించుకున్నప్పటికీ గత నాలుగు రోజులుగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యేసులు శుక్రవారం రాత్రి మృతి చెందగా.. శనివారం మృతదేహాన్ని కొలలపూడి తరలించారు.