
నీటిపై రాతలా జలమార్గం
బకింగ్ హాం కాలువకు దక్కని పూర్వ వైభవం
చినగంజాం: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ నుంచి తమిళనాడు ప్రాంతంలోని పుదుచ్చేరి వరకు కొనసాగే బకింగ్ హాం కాలువ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా జలరవాణా మార్గాన్ని పునరుద్ధరించేందుకు ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. కానీ అవి ముందుకు మాత్రం కదలడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపగా, సర్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి. పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఆంగ్లేయుల పాలనలో 1806లో ఆనాటి బ్రిటిష్ పాలకులు బకింగ్ హాం కాలువ నిర్మాణం చేపట్టారు. జల మార్గం ద్వారా సౌకర్యవంతంగా తక్కువ ఖర్చుతో నిత్యావసర సరుకులు వరణా చేసేవారు. 1876–78 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతదేశాన్ని ఈ కాలువ కాపాడింది. 1965లో వచ్చిన తుపాన్, వరదల కారణంగా కాలువ దెబ్బతిని పూర్తి నిరుపయోగంగా మారింది. అప్పటి నుంచి ఆక్రమణల చెరలో కుంచించుకుపోయింది.
అడుగు ముందుకు పడని పనులు
కోస్తా తీరం వెంబడి ప్రయాణించే కాలువలో నావికా యోగ్యంగా 420 కి.మీ. వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా నల్లమడ లాకుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు(257 కి.మీ.) కొమ్మమూరు కాలువగా పిలుస్తారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వరకు బకింగ్ హాం కాలువ(163 కి.మీ.) విస్తరించి ఉంది. పెదగంజాం నుంచి సహజసిద్ధమైన కాలువ మార్గం ద్వారా చైన్నె నౌకాశ్రయానికి కలుపబడిన జలమార్గం ఇది. ఈ మార్గం పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంచనాలు చేపట్టింది. అడుగు ముందుకు పడలేదు. కృష్ణా డెల్టా పరివాహకంగా ఉన్న కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం జలరవాణా మార్గం ప్రకటన చేయడంతో నీటి పారుదల శాఖ అప్రమత్తమైంది. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన వంతెనల నిర్మాణాన్ని నిలిపివేసింది. పడవల రవాణాకు అనుకూలంగా డిజైన్‌లు మార్చవలసి వస్తుందని ఆలోచనతో పనులు నిలిపివేశారు.
రూ. 3 వేల కోట్లు ఖర్చు అంచనా
సుమారు 32 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేలా కాలువను తిరిగి డిజైన్ చేసి.. 30 నుంచి 40 టన్నుల బరువు సరుకును రవాణా చేసే ఓడలు ప్రయాణం చేసేలా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని సంబంధిత కన్సల్టెన్సీ సంస్థ నివేదించింది. జల రవాణాను పునరుద్ధరిస్తే ఏడాదికి సుమారు 11 మిలియన్‌ల టన్నుల సరుకును రవాణా చేసే అవకాశం ఉందని సర్వే సంస్థ పేర్కొంది. నావిగేషన్ కెనాల్‌గా ఉపయోగించవచ్చని తెలిసినా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. కాలువ అభివృద్ధి చేస్తే అమరావతికి బహుళ ప్రయోజనకారిగా ఉండనుంది.
ఒకప్పుడు కాకినాడ నుంచి నాటి మద్రాసు వరకు విస్తరించిన బకింగ్ హాం కాలువ జల రవాణాలో కీలకపాత్ర పోషించింది. బ్రిటిష్ వారి కాలంలో నిత్యావసర సరుకులు జలరవాణా ద్వారానే ఎక్కువగా అందుతుండేవి. ఆ కాలువ ప్రస్తుతం రూపు రేఖలు కోల్పోయింది. పునరుద్ధరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
పర్యాటక రంగానికి ఊతం
ప్రస్తుతం కాలువ ఆక్రమణల చెరలో చిక్కుకొని రొయ్యల చెరువులు, ఇతర నిర్మాణాలతో కుంచించుకుపోయింది. కెనాల్ అభివృద్ధి చేయాలంటే భూ సేకరణకు రూ. 391 కోట్లు, డ్రెడ్జింగ్ కోసం రూ. 333 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో సర్వే సంస్థ తేల్చి చెప్పింది. గతంలో ఉన్న లాకులు ధ్వంసం అవడంతో అత్యంత విలువైన కలప, రాగి రేకులు దొంగలపాలయ్యాయి. కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు 420 కి.మీ. పరిధిలో 48 లాకులు, 15 టెర్మినల్స్ నిర్మించడం ద్వారా అందుబాటులోకి తీసుకొని రావచ్చని నిపుణులు చెబుతున్నారు. జలరవాణాతో పాటు పర్యాటక రంగానికి కూడా తోడ్పాటు అందించే అవకాశాలున్నాయి.

నీటిపై రాతలా జలమార్గం