
నేడు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవాన్ని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి తెలిపారు. బుధవారం నగర శివారుల్లోని లాంఫాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఆమె వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయ గౌరవ కులపతి, గవర్నర్ ఎస్. అబ్దుల్‌నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. పూర్వ విద్యార్థి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పంజాబ్ గవర్నమెంట్, డైరెక్టర్ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ. వేణుప్రసాద్ పాల్గొంటారని ఆమె తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారికి స్నాతకోత్సవంలో పురస్కారాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇంటి సిలిండర్లు
వ్యాపారానికి వాడితే చర్యలు
గుంటూరు వెస్ట్: గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వాడితే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఆర్.చంద్రముని తెలిపారు. గత రెండు రోజులుగా నగరంలో 20 రెస్టారెంట్లు, టిఫిన్ బండ్లపై సిబ్బందితో దాడులు చేసినట్లు చెప్పారు. ఇందులో 147 డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారాలకు ఉపయోగిస్తునట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని 30 మందిపై 6–ఏ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇక నుంచి తరచూ తనిఖీలు చేస్తామని ఆయన వెల్లడించారు.
వైభవంగా శాకంబరీ దేవి ఉత్సవాలు
తెనాలి: స్థానిక గాంధీ చౌక్‌లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో బుధవారం శాకంబరీ దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు జంపని నాగభాస్కర్ ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. అమ్మవారిని వివిధ కూరగాయలతో విశేషంగా అలంకరించారు.అర్చకులు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆలయంలో శాకాంబరీ దేవి ఉత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు తాళాబత్తుల ఉదయ్‌శంకర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శాకంబరీ దేవిగా దుర్గమ్మ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పెదకోనేరులోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం శాకంబరీ దేవి అలంకారోత్సవాలు ప్రారంభమ్యాయి. ఆలయ అర్చకులు కూర్మాల బాలసాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కూర్మాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజలు పాటు అమ్మవారికి అలంకార ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు అమ్మవారిని కూరగాయలతో శోభాయమానంగా అలంకరించామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రావణ మాసం ప్రారంభం రోజు పూలతో అలంకరించి పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

నేడు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

నేడు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

నేడు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం