
కౌన్సిలర్ హుకుం... కమిషనర్ జీ హుజూర్
చీరాల: పట్టణంలోని పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో కింద ఫ్లోర్‌లో వస్త్ర, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కింద షాపులు, పైన నివాస సముదాయాలున్నాయి. అయితే ఇదంతా మామూలుగా ఉంది కదా అనుకుంటే పొరపాటే. మంగళవారం అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ వ్యాపారస్తుల వద్దకు వచ్చి షాపుల ముందు పెట్టిన బట్టల బేళ్లు తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. సాయంత్రానికి తొలగించకుంటే బయటకు లాగేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
జరిగింది ఇదీ..
చీరాల పట్టణంలోని 12వ వార్డులో పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్ కింద భాగంలో పలువురు ఎప్పటి నుంచో వస్త్రవ్యాపారాలు నిర్వహిస్తున్నారు. షాపుల బయట బట్టల బేళ్లు పెట్టుకుంటున్నారు. అయితే అదే అపార్టుమెంట్‌లో నివసిస్తున్న అధికార పార్టీ మహిళా కౌన్సిలర్‌కు మాత్రం ఇది నచ్చలేదు. బట్టల బేళ్లు బయట అడ్డంగా పెట్టవద్దంటూ వ్యాపారస్తులకు సూచించారు. సీజన్ కావడంతో బయట పెట్టుకుంటేనే వ్యాపారం జరుగుతుందని, వ్యాపారాలు సరిగా లేవు, కస్టమర్లు వెళ్లిన తర్వాత లోపల పెట్టుకుంటామని చెప్పారు. అంతే ఆమెకు కోపం వచ్చి వ్యవహారం ఇంకోలా మారింది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్‌ను అక్కడకు పిలిపించారు. ఏదో తప్పు చేసినట్లుగా ఆయన అక్కడకు వచ్చి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంప్లెక్సులో షాపుల ముందు పెట్టిన బేళ్లు, బట్టలు సాయంత్రానికి తొలగించకుంటే మా మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు మీద పడవేస్తారు’’ అంటూ బెదిరింపు ధోరణితో చెప్పి వెళ్లారు. దీంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. ఇదేమీ మున్సిపల్ కాంప్లెక్సు కాదని, ప్రైవేటు కాంప్లెక్సులోని వస్త్ర వ్యాపారస్తులపై కమిషనర్ వచ్చి బెదిరింపు ధోరణిగా మాట్లాడడం ఏమిటని వ్యాపారస్తులు వాపోతున్నారు. తోటి వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు లేనప్పుడు ఓ అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్‌ను పిలవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. కాగా దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేశారా అని అడుగగా సమాధానం కరవవడం గమనార్హం.
ప్రైవేటు అపార్టుమెంట్ వ్యవహారంలో కమిషనర్ అత్యుత్సాహం వ్యాపారస్తులపై కమిషనర్ హడావిడి