
ఉన్మాదిని ఉరితీయండి
బాపట్లటౌన్: ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి కాల్చిచంపిన ఉన్మాది భర్తను ఉరితీయాలంటూ మృతురాలి బంధువులు ముక్తకంఠంతో నినదించారు. మండలంలోని చెరువుజమ్ములపాలెంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న దాసరి సుభాషిణి(28)పై ఆమె భర్త హరీష్ (టీడీపీ నాయకుడు) పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. సుభాషిణి మృతికి కారకుడైన కిరాతక భర్తను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మంగళవారం ఉదయం 8 గంటలకు జమ్ములపాలెం గ్రామ సమీపంలోని బాపట్ల–పెదనందిపాడు రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన కొనసాగింది. మండుటెండను కూడా లెక్కచేయక మహిళలంతా ఆందోళనలో పాల్గొన్నారు. మృతురాలి తల్లి మేరిమ్మ మాట్లాడుతూ చెప్పుడు మాటలు విని, అనుమానంతో అతి కిరాతకంగా చంపిన వాడిని వెంటనే ఉరితీయండి...నడిరోడ్డుపై కాల్చి చంపండి...నా కూతురుతోపాటే వాడిని కూడా పూడ్చేయాలంటూ డిమాండ్ చేసింది. గుండెలు పగిలేలా రోదించిన ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. మృతురాలి మేనత్త సునీత మాట్లాడుతూ సుభాషిణిను అతి కిరాతకంగా చంపిన వాడిని పెట్రోలు పోసి తగలపెట్టేవరకు ధర్నా విరమించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతురాలి చెల్లి హారిక మాట్లాడుతూ మా అక్క పెళ్లి అయి 13 సంవత్సరాలైంది, నేను, మా అక్క ఇద్దరం ఒకే ఊరిలో ఉంటామని చెప్పింది. అయినా ఏరోజు కూడా మా అక్కను మా ఇంటికి పంపలేదు, బంధువులతో మాట్లాడినా కొట్టేవాడని చెప్పింది. అప్పటి నుంచి కూడా నరకం అనుభవిస్తూనే ఉందని, మా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు చెప్పిన తప్పుడు మాటలు విని ఇంట్లో నిద్రిస్తున్న మా అక్కపై పెట్రోలుపోసి నిప్పంటించాడని పేర్కొంది. మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపైనే కూర్చున్నా ఏ ఒక్క అధికారికానీ, నాయకుడు కానీ మా మొర ఆలకించిన దాఖలాలు లేవంటూ వాపోయింది.
కఠినంగా శిక్షించేవరకు రాస్తారోకో విరమించేది లేదు బాపట్ల–పెదనందిపాడు రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు
పాలకుల తీరుపై మండిపడిన గ్రామస్తులు
టీడీపీకి చెందిన కొందరు నాయకులు, మహిళలు ధర్నా చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ధర్నా విరమించాలంటూ సూచించారు. అధికారం ఉందనే ఆహంతో భార్యను అతి కిరాతకంగా పెట్రోలు పోసి చంపిన భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా న్యాయంకోసం పోరాడుతున్న మమ్ములను ఇక్కడి లేవమంటారా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ పోలీసులు ఇచ్చిన హామీ మేరకు రాస్తారోకో విరమించారు.

ఉన్మాదిని ఉరితీయండి