పూనూరు పోస్టుమాస్టర్‌పై ఖాతాదారుల ఫిర్యాదు
ఉన్నతాధికారుల దర్యాఫ్తు
యద్దనపూడి: బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు గ్రామ పోస్టుమాస్టర్ అవినీతి ఆరోపణలపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో శనివారం అధికారులు పూనూరులో విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.... పూనూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఉప్పుల సాంబశివరావు గత నెల 6వ తేదీ అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సాంబశివరావు జీవించి ఉన్న సమయంలో రెండు రికరింగ్ డిపాజిట్లు ప్రారంభించి ప్రతి నెలా రూ.5000 కిస్తీలు చెల్లిస్తూ వచ్చాడు. ఇలా ఫిబ్రవరి నెల వరకు పోస్టుమాస్టరుకు నగదు చెల్లిస్తూ వచ్చాడు. రికరింగ్ డిపాజిట్లకు సంబంఽధించిన పుస్తకాలు మాత్రం పోస్టుమాస్టరు వద్దే ఉంచుకుంటూ వస్తున్నాడు. అందులో ఒక ఆర్డీ పుస్తకానికి సంబంధించి 7 నెలల వరకు నగదు చెల్లించలేదు. ఇలా సూమారు రూ.17,500 పోస్టుమాస్టరు తన సొంతానికి వాడుకున్నాడని మృతుని కుమారుడు అంకినీడు ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సేవింగ్ ఖాతాలో గత సంవత్సరం 7–2–24న, 16–10–24న తేదీన రెండుసార్లు మెత్తం రూ.40 వేలు నగదు డ్రా చేసినట్లు కుటుంబసభ్యులు ఆధారాలతో పోస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గ్రామంలో మరికొంత మంది వ్యక్తుల నుండి ఆర్డీల పేరిట నెలనెల కిస్తీలు వసూలు చేసి వాటికి ఇవ్వాల్సిన డిపార్ట్‌మెంట్ తాలుకా రసీదులు ఇవ్వకుండా చిన్నసైజు పాకెట్ సైజ్ పుస్తకంలో నెలనెల ఆర్డీ సొమ్మును జమ చేస్తున్నట్లు ఖతాదారులకు ఇస్తూ పోస్టల్‌శాఖ పుస్తకాలు మాత్రం తన దగ్గరే ఉంచుకుంటున్నాడని పలువురు అధికారులకు తెలిపారు. ఈ విచారణలో భాగంగా చీరాల అసిస్టెంట్ సూపంటెండెంట్ ఆఫ్ పోస్టు ఆఫీస్ (ఏఎస్‌పీ) శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకున్నానని పోస్టుమాస్టర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంతకాలను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.


