చీరాల: ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మాజీ మంత్రి పాలేటి రామారావుల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఎమ్మెల్యే గ్రూపు నేరుగా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటుండగా పాలేటి గ్రూపు మాత్రం ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేరుతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. వీరి మధ్య వివాదానికి గతంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కారణమైంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వ్యవహారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాలని ఆయన తరపున పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పట్టుబట్టారు.
ఈ వ్యవహారం తన ఆధ్వర్యంలో జరగాలని పాలేటి భీష్మించుకుని కూర్చొన్నారు. ఈ వ్యవహారం సర్దుమణిగింది. మరో రాజకీయ వ్యవహారం బయటపడింది. చీరాల గొల్లపాలెం శ్మశానవాటిక ప్రహరీ వ్యవహారం ఇద్దరి మధ్య రాజకీయ చిచ్చుకు దారితీసింది. మూడు రోజుల కిందట ఎమ్మెల్యే కొండయ్య అధికారికంగా ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. శ్మశాన స్థలంలో కొంత తమది ఉందంటూ కొందరు ముందుకు రావడంతో ఈ విషయంపై ఇరువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్నో ఏళ్లు శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణం జరగకుండా ఉందని చెప్పి స్థానికులతో చర్చించి ఆయన అక్కడే కూర్చొని ప్రహరీ నిర్మాణం జరిపించారు. ఎమ్మెల్యే వాయిదా వేసిన విషయాన్ని పాలేటి నిర్మాణ పనులు దగ్గరుండి చేయించడంపై చీరాలలో రాజకీయ చర్చలకు తెరలేపింది. ముందు ముందు ఇరువురి మధ్య పలు కీలక అంశాలు రాజకీయ దుమారం, విభేదాలు జరుగుతాయని టీడీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు.
నాడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నేడు శ్మశానవాటికి ప్రహరీ నిర్మాణంపై రచ్చ


