బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
అభివృద్ధి పనులు
సత్వరం పూర్తిచేయాలి
బాపట్లటౌన్: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో దిశ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కో–ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ టి.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాబోయే సంవత్సరంలో 76 లక్షల పని దినాలను కూలీలకు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రహదారుల మరమ్మతులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో అమృత ధార మెగా ప్రాజెక్ట్ కోసం రూ.3500 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. కలెక్టర్ జె. వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేసిన అభివృద్ధి పనులు పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి పథకాల మరమ్మతుల కోసం జలజీవన్ మిషన్ కింద 400 పనులు రూ.149 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ప్రకాశం జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ బోసు, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, డీపీఓ ప్రభాకర్, హౌసింగ్ పీడీ వై.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.


