అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
తెనాలిరూరల్: వరుస చోరీలకు ప్పాడుతున్న అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన తెనాలి ఆటోనగర్‌లోని స్టీలు కంపెనీతో పాటు త్రీ టౌన్ పరిధిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు, వైన్ షాపులు, మరో రెండు దుకాణాల్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే.. ఆటోనగర్ కేసును దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు నిందితులను గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్‌వలిగా గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తెనాలి రూరల్, త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ల పరిధితో పాటు అమరావతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాది గ్రామంలోని ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, అమరావతిలో ఓ దుకాణంలో నగదు అపహరించుకెళ్లినట్లు ఒప్పుకొన్నారు. చెడు అలవాట్లకు బానిసలై చోరులుగా మారిన వీరిద్దరూ డిసెంబరులోనే జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే నేరాలకు పాల్పడడం ప్రారంభించినట్టు సీఐ తెలిపారు. సందీప్ 28 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, మస్తాన్ వలి 12 కేసుల్లో జైలుకెళ్లాడని చెప్పారు. నిందితుల నుంచి 8.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.17 వేల స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఊరు వెళ్లే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలానే ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ ఉన్నారు.


